అక్షరటుడే, కామారెడ్డి: Municipal Meeting | ఈ నెల 13న జరిగిన కామారెడ్డి (Kamareddy) మున్సిపల్ సమావేశం గందరగోళంతో వాయిదా పడింది. అప్పుడు ఆమోదం పొందాల్సిన 40 అంశాలు అలాగే నిలిచిపోయాయి. దాంతో ఆ సమావేశాన్ని బుధవారానికి వాయిదా వేశారు.
Municipal Meeting | కౌన్సిల్ సభ్యులకు సమాచారం..
ఈ సందర్భంగా బుధవారం సమావేశం కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కౌన్సిల్ సభ్యులకు సమాచారం కూడా అందించారు. 13న జరిగిన సమావేశంలో మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, వసూళ్లు, అధికారుల పనితీరుపై బీజేపీ, బీఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రశ్నల వర్షం కురిపించారు. పోడియం ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన సమావేశంలో ఎజండా అంశాల జోలికి వెళ్లలేదు.
Municipal Meeting | అడిషనల్ కలెక్టర్ చెప్పినా..
అడిషనల్ కలెక్టర్ వచ్చి సర్ది చెప్పినా కౌన్సిలర్లు వినలేదు. దాంతో పారిశుధ్యం, విద్యుత్, తాగునీరు వంటి అత్యవసర అంశాలకు మాత్రమే కౌన్సిల్ ఆమోదముద్ర వేసింది. దాంతో బుధవారం జరిగే సమావేశమైనా సజావుగా సాగుతుందా..? రూ. 4.40 కోట్ల పనులకు, ఇతర పనులకు కౌన్సిల్ పచ్చజెండా ఊపుతుందా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. నూతన పాలకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన సమావేశాల్లో సైతం ఎజండా అంశాలను ప్రస్తావించకుండానే సమావేశాలు వాయిదా పడ్డాయి. దీంతో పట్టణ ప్రజల సమస్యల పట్ల పాలకవర్గానికి పట్టింపు లేదని, కేవలం అవినీతి, అక్రమాలపైనే ఫోకస్ చేసి విలువైన సమయాన్ని రాజకీయ అవసరాల కోసం వృథా చేస్తున్నారన్న టాక్ పట్టణ ప్రజల నుంచి వినిపిస్తోంది.
Municipal Meeting | ప్రధాన సమస్యలపై చర్చిస్తారా..లేదా..?
బుధవారం నిర్వహించే సమావేశంలోనైనా పట్టణ ప్రజలకు అవసరమైన ప్రధాన సమస్యలపై చర్చించి ఆమోదం తెలుపుతారా..? గత సమావేశాల మాదిరిగానే తిరిగి వాయిదా వేసే పరిస్థితులు కల్పిస్తారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవేళ అదే జరిగితే మరోసారి సమావేశం నిర్వహించడానికి అధికారులు జంకే పరిస్థితులు నెలకొననున్నాయి. ఇప్పటికే కామారెడ్డి బల్దియాపై వస్తున్న ఆరోపణలపై సీరియస్గా ఉన్న కలెక్టర్ బల్దియాను నేరుగా కలెక్టర్ పర్యవేక్షించే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. అదే జరిగితే ప్రత్యేక అధికారుల పాలనను తలపించే అవకాశం ఉన్నట్టుగా రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దాంతో రేపు జరగబోయే సమావేశంపైనే అందరి దృష్టి నెలకొంది.
ఇది కూడా చదవండి..: Gopashtami Celebrations | గోమాతను, స్త్రీని పూజించే భూమి పావనమే..: అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్