UPI MDR Charges | యూపీఐ యూజర్లకు శుభవార్త.. ఆ ఛార్జీల అమలు మళ్లీ వాయిదా..

భారతదేశంలో సామాన్యుడి నుంచి వ్యాపారుల వరకు నిత్యజీవితంలో భాగమైపోయిన యూపీఐ (UPI) డిజిటల్ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) ఛార్జీల అమలు మరోసారి వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: UPI MDR Charges | భారతదేశంలో సామాన్యుడి నుంచి వ్యాపారుల వరకు నిత్యజీవితంలో భాగమైపోయిన యూపీఐ (UPI) డిజిటల్ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) ఛార్జీల అమలు మరోసారి వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి ఈ ఏడాది అక్టోబర్ 15 నుంచే ఈ ఛార్జీలను అమలు చేయాలని ప్రతిపాదించినప్పటికీ, పండుగ సీజన్, వ్యాపారుల అభ్యంతరాల కారణంగా ప్రభుత్వం వెనక్కి తగ్గింది. తాజాగా 2027 ప్రథమార్ధంలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసే వరకు ఈ నిర్ణయాన్ని నిలిపివేసే అవకాశం ఉందని ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ కథనం వెల్లడించింది.

UPI MDR Charges | అసెంబ్లీ ఎన్నికలే ప్రధాన కారణమా?

2027 ప్రథమార్ధంలో ఉత్తరప్రదేశ్, పంజాబ్ ( Punjab ), ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ కీలక సమయంలో యూపీఐపై ఛార్జీలు విధిస్తే వ్యాపారులు, వర్తక సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) మధ్య చర్చలు కొనసాగుతున్నప్పటికీ, తుది అమలు తేదీపై ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు.

UPI MDR Charges | ఎండీఆర్ ఛార్జీలు ఎవరికి వర్తిస్తాయి?

కస్టమర్లు డిజిటల్ చెల్లింపులు చేసినప్పుడు, ఆ లావాదేవీలను ప్రాసెస్ చేసే బ్యాంకులు, పేమెంట్ సంస్థలకు వ్యాపారులు చెల్లించే సర్వీస్ రుసుమునే ‘మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR)’ అంటారు. ప్రతిపాదిత కొత్త విధానం ప్రకారం, ఒక కస్టమర్ నుంచి వ్యాపారికి (Person-to-Merchant) జరిగే రూ. 2,000 కంటే ఎక్కువ విలువైన ఎంపిక చేసిన యూపీఐ చెల్లింపులపై 0.4 శాతం ఎండీఆర్ ఛార్జీ విధిస్తారు. అయితే రూ. 75,000 లేదా అంతకంటే ఎక్కువ విలువైన లావాదేవీలకు గరిష్ఠంగా రూ. 300 మాత్రమే ఛార్జీగా వసూలు చేసేలా పరిమితి నిర్ణయించారు.

కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చినప్పటికీ సామాన్య వినియోగదారులపై ఎలాంటి ఆర్థిక భారం పడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఎండీఆర్ ఛార్జీలను కేవలం వ్యాపారుల నుంచి మాత్రమే వసూలు చేయాలి తప్ప, కస్టమర్లపై నేరుగా వేయకూడదని నిబంధనలు చెబుతున్నాయి.

UPI MDR Charges | వీటికి పూర్తి మినహాయింపు..

ఒక వ్యక్తి మరో వ్యక్తికి (P2P) చేసే నగదు బదిలీలు, వ్యాపారులకు చేసే రూ. 2,000 లోపు చెల్లింపులు, నెలకు రూ. లక్ష వరకు యూపీఐ క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపులు స్వీకరించే చిన్న వ్యాపారులకు ఈ ఛార్జీల నుంచి పూర్తి మినహాయింపు ఉంటుంది. కొత్త అమలు తేదీపై అధికారిక ప్రకటన వెలువడే వరకు ప్రస్తుతం ఉన్న ఉచిత సేవలే యథావిధిగా కొనసాగనున్నాయి.

ఇది కూడా చదవండి:  India Development | సరికొత్త ఆట ఆడుతున్న భారత్​ : ప్రధాని మోదీ

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *