అక్షరటుడే వెబ్‌డెస్క్: Cyberabad Event Rules | సైబరాబాద్ పరిధిలో పెళ్లిళ్లు, శుభకార్యాలు, ఇతర వేడుకలు నిర్వహించేవారికి అధికారులు కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చారు. ఇకపై 100 మందికి పైగా జనం హాజరయ్యే కార్యక్రమాలకు నిర్వాహకులు తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు, కన్వెన్షన్ సెంటర్లు, ఫంక్షన్ హాళ్లకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. 100 మందికి మించి హాజరయ్యే వేడుకకు కనీసం మూడు రోజుల ముందే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (CPCB) వెబ్‌సైట్‌లోని ఈవెంట్ ఇంటిగ్రేషన్ విధానం ద్వారా అనుమతి పొందాలి. ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని సైబరాబాద్ కార్పొరేషన్ కమిషనర్ డాక్టర్ జి. సృజన డిప్యూటీ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు.
Cyberabad Event Rules | ముందస్తు సమాచారం..
పెద్ద ఎత్తున వ్యర్థాలు ఉత్పత్తి చేసే సంస్థలుగా ఇప్పటివరకు కేవలం 250 కంపెనీలు మాత్రమే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వద్ద రిజిస్టర్ చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలను కార్పొరేషన్ అప్రమత్తం చేసింది. కొత్త నిబంధనలపై ప్రతి సంస్థకు అవగాహన కల్పించే బాధ్యతను సర్కిల్ డిప్యూటీ కమిషనర్లకు అప్పగించారు. నిర్వాహకులు ముందుగానే సమాచారం ఇస్తే, వేడుక జరిగే చోట పోగయ్యే చెత్తను సకాలంలో తరలించేందుకు ఏర్పాట్లు చేస్తామని అధికారులు తెలిపారు. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లో ఉన్నాయని, రోజుకు 100 కిలోలకు పైగా చెత్త ఉత్పత్తి చేసే కేంద్రాలను బల్క్ గార్బేజ్ జనరేటర్లుగా పరిగణిస్తారని పేర్కొన్నారు. అలాంటి సంస్థలు తడి, పొడి, ఇతర వ్యర్థాలను వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అప్పగించాలి. కిలో చెత్తకు సుమారు రూ. 3 రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
Cyberabad Event Rules | డ్రైనేజీలపై ప్రత్యేక దృష్టి..
హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మాదిరిగానే సైబరాబాద్‌లోని ప్రధాన రహదారుల వెంబడి ఫుట్‌పాత్‌లను అభివృద్ధి చేయాలని కార్పొరేషన్ నిర్ణయించింది. రోడ్ల విస్తరణ పనులతో పాటు ఇరువైపులా అంతర్జాతీయ ప్రమాణాలతో కాలిబాటలు నిర్మించాలని కమిషనర్ ఆదేశించారు. అలాగే కేవలం ప్రహరీ గోడలతో ఖాళీగా ఉన్న 350 ప్లాట్లను పార్కులుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వీటి డిజైన్లు రూపొందించి త్వరలో ఏడీబీ (ADB)కి సమర్పించనున్నారు. జాతీయ రహదారుల పక్కన వర్షపు నీరు, వరద నీరు సులభంగా పారేలా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు, పాత నాలాలను పునరుద్ధరించే పనులపైనా అధికారులు దృష్టి సారించారు.
ఇది కూడా చదవండి: Revanth Reddy Siddipet Visit | సిద్దిపేటకు సీఎం రేవంత్ రెడ్డి.. స్పీచ్‌లో పొలిటికల్ హీట్ తప్పదా?