Kamareddy Municipal Dispute | బల్దియాకు ఛైర్మనే బాస్.. ఎమ్మెల్యే కాదు..: టీపీసీసీ జనరల్​ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్​ రెడ్డి

బల్దియాకు ఛైర్మనే బాస్.. ఎమ్మెల్యే కాదని టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Municipal Dispute | బల్దియాకు ఛైర్మనే బాస్.. ఎమ్మెల్యే కాదని టీపీసీసీ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. మున్సిపల్ సమావేశంలో ఎమ్మెల్యే వ్యవహరించిన తీరుపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గురువారం నియోజకవర్గ కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

Kamareddy Municipal Dispute | నోటికి వచ్చినట్లు మాట్లాడారు..

40 అంశాలతో ఈ నెల 13న కామారెడ్డి మున్సిపల్ సమావేశం జరిగిందని, ఆ రోజు వాయిదా వేసిన తర్వాత బీజేపీ కౌన్సిలర్లు ఎజండా అంశాలు చెల్లవని, బీఆర్ఎస్ కౌన్సిలర్లు కూడా దొంగవని వాకౌట్ చేశారని చంద్రశేఖర్​రెడ్డి అన్నారు. బుధవారం జరిగిన సమావేశం అదే ఎజండాతో జరిగిందని, ఎమ్మెల్యే కూడా హాజరయ్యారని పేర్కొన్నారు. ఈ సమావేశం కూడా ప్రారంభం నుంచి గొడవలతోనే మొదలైందన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 15 వ వార్డు కౌన్సిలర్ వనితను ఫోన్​లో వీడియో తీసి బయటకు పంపిస్తున్నారని, ఆమెను బయటకు వెళ్లాలని ఎమ్మెల్యే చెప్పడం హాస్యాస్పదమన్నారు. మున్సిపాలిటీకి​ ఛైర్మన్ బాస్ అని, ఎమ్మెల్యే కాదని స్పష్టం చేశారు. ఎక్స్ అఫీషియో హోదాలోనే ఆయన హాజరు కావాలన్నారు. కౌన్సిలర్లను వెళ్లమని చెప్పే అధికారం ఎమ్మెల్యేకు ఉండదని, ఛైర్మన్​కు మాత్రమే ఆ అధికారాలు ఉంటాయన్నారు. ఈ మాత్రం కూడా ఎమ్మెల్యేకు అవగాహన లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడటాన్ని తాము ఖండిస్తున్నామన్నారు. కౌన్సిలర్ తిరుగుబాటుతో క్షమించాలని ఎమ్మెల్యే తన తప్పు ఒప్పుకున్నారని చెప్పారు.

Kamareddy Municipal Dispute | గన్​మెన్లను వెనకాల ఉంచుకుని బెదిరించారు..

ఛైర్మన్ అనుమతితోనే ఇతర వ్యక్తులు, పాత్రికేయులకు సమావేశ హాలులోకి వచ్చే అవకాశం ఉంటుందని చంద్రశేఖర్​రెడ్డి తెలిపారు. బుధవారం నాటి సమావేశంలో గన్​ మెన్లతో సమావేశానికి ఎమ్మెల్యే వచ్చారని ఆరోపించారు. గన్​మెన్లను వెనకాల పెట్టుకుని ముందర ఉన్న కౌన్సిలర్లను బెదిరించడం తప్పన్నారు. దీనిపై కలెక్టర్, ఎస్పీలకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. అధికారులను కూడా ఎమ్మెల్యే బెదిరిస్తున్నారని ఆరోపించారు. అవినీతిపై సీడీఎంఏ, సీఎంకు ఫిర్యాదు చేస్తా అన్న ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. మున్సిపాలిటీలో నిజంగా అక్రమాలు జరిగితే ఫిర్యాదు చేయాలని సవాల్ విసిరారు. మూడేళ్ళ నుంచి నియోజకవర్గానికి ఎమ్మెల్యే చేసింది ఏమీ లేదన్నారు. క్యాంప్​ కార్యాలయంలో పంచాయతీలు తప్ప చేసేది ఏమీ లేదని విమర్శించారు. ఎమ్మెల్యే అనే విషయం కూడా ప్రజలకు తెలిసే పరిస్థితి లేదని, అధికారిక కార్యక్రమాల్లో కూడా పాల్గొనే పరిస్థితి ఎమ్మెల్యేకు లేదని చెప్పారు. ఎమ్మెల్యేకు మతిమరుపు బాగా ఉందని ఎద్దేవా చేశారు. పక్క వార్డులపై మాట్లాడవద్దు అని చెప్పిన ఎమ్మెల్యే ఎక్కడో ఉన్న మూసి సుందరీకరణ మీద అందరికంటే ముందే మాట్లాడిన విషయం మర్చిపోయినట్టున్నారన్నారు. ఆయనది నోరా, తాటిమట్టా అని ఆయన మాట్లాడిన మాటలు ఆయనకే వర్తిస్తాయన్నారు.

Kamareddy Municipal Dispute | వసూళ్లకు రుజువులు చూపించాలి..

వసూళ్లు చేస్తున్నారని చెప్పే దానిపై రుజువులను ఎమ్మెల్యే చూపించాలని పీసీసీ జనరల్​ సెక్రటరీ డిమాండ్ చేశారు. ప్రస్తుత కౌన్సిల్ ఏర్పడి ఏడాది అయిందని, ఎమ్మెల్యే అయ్యే సమయానికి పాత పాలకవర్గం కూడా ఏడాది పాటు ఉందన్నారు. మూడేళ్ళలో ఇప్పటివరకు అవినీతి అక్రమాలు, వసూళ్లపై ఎన్ని ఫిర్యాదులు చేశారో ఎమ్మెల్యే చెప్పాలని ప్రశ్నించారు. ఎక్స్ అఫీషియో సభ్యుడికి 2019 మున్సిపల్ చట్టం ప్రకారం వేదికపై కూర్చునే హక్కు లేదని, సమావేశం మొత్తం ఆయనే లీడ్ తీసుకుని నిర్వహించాల్సిన హక్కు లేదని స్పష్టం చేశారు. బల్దియాలో వసూళ్ల బాగోతం తెలిస్తే ఎమ్మెల్యే ఏం చేస్తున్నారని నిలదీశారు. మూడేళ్ళ నుంచి కామారెడ్డి పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని, ఈ విషయాన్ని ఎమ్మెల్యే గ్రహించాలన్నారు. ఆయన ఎమ్మెల్యేగా వ్యవహరించాలని, కామారెడ్డి పరిస్థితిని పట్టించుకోవాలని సూచించారు. అవినీతిని ఎమ్మెల్యే నిరూపిస్తే తాము కూడా ఆయనకు సహకరిస్తామన్నారు.

Kamareddy Municipal Dispute | బెదిరించే బదులుగా నిధులు తేవాలి..

బెదిరించే బదులుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు తేవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికి ఒక్క రూపాయి అయినా కేంద్రం నిధులు తెచ్చారా అని ప్రశ్నించారు. మున్సిపల్ సమావేశానికి ఎజండా పాస్ చేయడానికి వచ్చారా.. లేక కౌన్సిలర్లను సెట్ చేసేందుకు వచ్చారా..ఎందుకు వచ్చారని నిలదీశారు. మరోసారి తాను రానని చెప్పి ఎమ్మెల్యే వెళ్ళిపోయారని, ఆయనను రమ్మని ఎవరన్నారని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే వైఖరి మార్చుకోవాలని, గ్రామాల్లో పర్యటించి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటే ప్రజలతో సఖ్యత ఏర్పడుతుందని సూచించారు. ఈ సమావేశంలో సేవాదల్ జిల్లా అధ్యక్షుడు మహేష్, నియోజకవర్గ అధ్యక్షుడు మెహెర్ బాబాగౌడ్, యూత్ అధ్యక్షుడు మహేష్, బండారు శ్రీకాంత్, అబీద్, మాజీ కౌన్సిలర్లు వంశీ, సాయిబాబా, మున్ను, సయ్యద్ అహ్మద్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: సాగర్ లో ఏపీ సొరంగ పనులపై.. 9నెలలు మౌనం.. ఇప్పుడు ఆపుతారంట..!! 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *