అక్షరటుడే వెబ్‌డెస్క్: Revanth Owaisi Alliance | జాతీయ స్థాయిలో పరస్పరం విమర్శించుకునే కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు తెలంగాణలో మాత్రం భిన్నమైన రాజకీయ వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. కేంద్రంలో ఎప్పుడూ పోరుబాటలో ఉండే ఈ రెండు పార్టీలు, రాష్ట్రంలో మాత్రం అధికార కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీల ( Asaduddin Owaisi )మధ్య నడుస్తున్న రాజకీయం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Revanth Owaisi Alliance | అప్పట్లో మాటల తూటాలు..
ఒకప్పుడు రేవంత్ రెడ్డి, అసదుద్దీన్ ఒవైసీల మధ్య రాజకీయంగా తీవ్ర వాగ్వాదాలు జరిగేవి. రేవంత్‌ను టార్గెట్ చేస్తూ ఒవైసీ విమర్శలు చేయగా, ఎంఐఎమ్ను బీజేపీ ‘బీ-టీమ్’ అంటూ రేవంత్ తీవ్రంగా మండిపడేవారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు మారుతూ వచ్చాయి. తాజాగా సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. జాతీయ రాజకీయాలకు భిన్నంగా రాష్ట్రంలో ఈ ఇద్దరు నేతల మధ్య సాగుతున్న సఖ్యత వెనుక పెద్ద వ్యూహమే ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Revanth Owaisi Alliance | రేవంత్ వ్యూహం..
రాజధాని హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ పట్టు సాధించాలన్నా, మైనారిటీ ఓటు బ్యాంకును పదిలపరుచుకోవాలన్నా ఎంఐఎం నేతలతో సఖ్యతగా ఉండటం అవసరమని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తు రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని, మైనారిటీ వర్గాలపై గట్టి పట్టున్న ఆ పార్టీతో మైత్రి కొనసాగించడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలని సీఎం ప్రణాళిక వేస్తున్నట్లు సమాచారం. మరోవైపు, పాతబస్తీ అభివృద్ధి, పరిపాలనా పరమైన అంశాలు, తమ నెట్‌వర్క్‌కు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూసుకోవడానికి ఒవైసీ బ్రదర్స్ కూడా అధికార పార్టీతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారనే చర్చ జరుగుతోంది.
Revanth Owaisi Alliance | బీజేపీకి దొరుకుతున్న అస్త్రం?
తెలంగాణలో దాదాపు 15 శాతానికి పైగా ఉన్న ముస్లిం ఓటర్లు సుమారు 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను ప్రభావితం చేసే శక్తి కలిగి ఉన్నారు. ఈ ఓటు బ్యాంకును కాపాడుకోవడం ఇరు పార్టీలకూ కీలకంగా మారింది. అయితే, వీరిద్దరి మధ్య కుదిరిన ఈ అనధికారిక దోస్తీని ఆయుధంగా మలుచుకోవడానికి ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ పావులు కదుపుతోంది. కాంగ్రెస్, ఎంఐఎంలు లోపాయికారి ఒప్పందంతో ముందుకు వెళ్తున్నాయని ప్రచారం చేస్తూ ప్రజల్లోకి వెళ్లేందుకు కమలనాథులు సిద్ధమవుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ పొలిటికల్ ఈక్వేషన్స్ రాష్ట్ర రాజకీయాలను ఏ విధంగా ప్రభావితం చేస్తాయనేది ఆసక్తికరంగా మారింది.
ఇది కూడా చదవండి: Stock Market Gains | లాభాల బాటలో మార్కెట్లు