అక్షరటుడే వెబ్‌డెస్క్: Revanth Reddy Siddipet Visit | సిద్దిపేట పర్యటన కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికొన్ని గంటల్లో బయలుదేరనున్నారు. ఈ పర్యటనలో సీఎం ప్రసంగం అభివృద్ధి, సంక్షేమ ప్రకటనలకే పరిమితమవుతుందా, లేక గులాబీ నేతలను లక్ష్యంగా చేసుకుని రాజకీయ వేడి రగిలిస్తారా అనే అంశంపై జిల్లావ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇటీవల బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావులే లక్ష్యంగా సీఎం దూకుడు పెంచిన విషయం తెలిసిందే. కేసీఆర్, హరీష్ రావులకు (Harish Rao ) చెందిన వ్యవసాయ క్షేత్రాల వ్యవహారాలను తెరపైకి తీసుకురావడమే కాకుండా, కాంగ్రెస్ నేతలు ఆ క్షేత్రాలను సందర్శించి విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత సిరిసిల్ల సభలో కేటీఆర్‌పై రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో, ఇప్పుడు సిద్దిపేట వేదికగా ఏం మాట్లాడతారనే దానిపై ఆసక్తి నెలకొంది.
Revanth Reddy Siddipet Visit | ఇందిరమ్మ జీవిత బీమా..
సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాల్లో పర్యటిస్తానని సీఎం గతంలోనే ప్రకటించగా, అందులో భాగంగా సిద్దిపేటలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభా వేదిక నుంచే ‘ఇందిరమ్మ జీవిత బీమా’ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. దీంతో పాటు సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌తో పాటు రెండు తెలంగాణ పబ్లిక్ పాఠశాలల నిర్మాణాలకు వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు. సిద్దిపేట మున్సిపాలిటీకి రూ. 50 కోట్లు, మల్లన్న సాగర్ నిర్వాసితులకు రూ. 350 కోట్ల నిధులు విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.
అభివృద్ధి పనుల్లో భాగంగా కొమురవెల్లి మండల కేంద్రంలోని మల్లికార్జున స్వామి దేవాలయంలో రూ. 14.35 కోట్లతో నిర్మించిన 50 గదుల సత్రం, రూ. 12 కోట్లతో నిర్మించిన క్యూ కాంప్లెక్స్‌లను సభా వేదిక నుంచే సీఎం వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.
Revanth Reddy Siddipet Visit | మాటల తూటాలు పేలుతాయా?
గత కొంతకాలంగా మాజీ మంత్రి హరీష్ రావుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ కంచుకోటగా భావించే సిద్దిపేట గడ్డపై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారోనని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకే ప్రాధాన్యత ఇస్తారా లేక కేసీఆర్, హరీష్ రావులపై విమర్శనాస్త్రాలు సంధిస్తారా అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది.
ఇది కూడా చదవండి: Indiramma Family Insurance | రేషన్‌కార్డు ఉన్నవారికే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా : కలెక్టర్ ఇలా త్రిపాఠి