BC Welfare | తెలంగాణ వచ్చాకే బీసీల అణచివేత ఎక్కువైంది : జాజుల శ్రీనివాస్​ గౌడ్​

తెలంగాణ రాష్ట్రం వచ్చాకే బీసీలకు ఇంకా ఎక్కువ అన్యాయం జరుగుతోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: BC Welfare | తెలంగాణ రాష్ట్రం వచ్చాకే బీసీలకు ఇంకా ఎక్కువ అన్యాయం జరుగుతోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ (Jajula Srinivas Goud) అన్నారు. జిల్లా కేంద్రంలోని కేర్​ డిగ్రీ కళాశాలలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు.

BC Welfare | 12 ఏళ్లు గడిచినా..

తెలంగాణ (Telanagana) రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు గడిచినప్పటికీ తెలంగాణలో బీసీలకు తీరని అన్యాయం జరుగుతూనే ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కాసోజు శ్రీకాంతాచారి నుంచి కానిస్టేబుల్ కిష్టయ్య వరకు, కొండా లక్ష్మణ్ బాబూజీ నుంచి మొదలుకొని ప్రొఫెసర్ జయశంకర్ వరకు బీసీలే రాష్ట్రం రావడానికి ప్రధాన కారణమయ్యారన్నారు. సకలజనుల సమ్మె, విద్యార్థి జేఏసీ, ధూమ్​ దాంలతో తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ఉదృతం చేసింది బహుజన వర్గాలేనని, త్యాగాలు బీసీ ఎస్సీ, ఎస్టీలు చేస్తే ఈరోజు పిడికెడైనా లేని అగ్రకులాలు రాష్ట్రాన్ని ఏలుతున్నాయన్నారు.

BC Welfare | ఉమ్మడి రాష్ట్రంలోనే బీసీ ఎమ్మెల్యేలు ఎక్కువ

తెలంగాణ రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో తెలంగాణ ప్రాంతం నుండి బీసీ ఎమ్మెల్యేల సంఖ్య 24 మంది ఉంటే తెలంగాణ వచ్చిన తర్వాత 19 మందికి తగ్గిందని జాజుల శ్రీనివాస్​ గౌడ్​ అన్నారు. మంత్రివర్గంలో తెలంగాణ నుండి ఐదుగురు బీసీలు మంత్రులుగా ఉంటే తెలంగాణ వచ్చిన తర్వాత ముగ్గురుకి తగ్గారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో ప్రాధాన్యత ఉన్న శాఖలను అప్పగించారని, తెలంగాణ వచ్చిన తర్వాత యువజన, అడవులు, పాడి పరిశ్రమ శాఖలు కేటాయించి బీసీలను అవమానించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

BC Welfare | జులై 2న కళాశాలల బంద్​

వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో 2008లో ఫీజు రీయింబర్స్​మెంట్​ స్కీమును (Fee Reimbursement) ఎలాంటి నిబంధన లేకుండా అమలు చేశారన్నారు. ప్రస్తుతం ఈ పథకాన్ని రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అనేక కుట్రలకు పాల్పడుతుందని దుయ్యబట్టారు. తాను చేయదలచుకున్న పనినీ కోర్టుల ద్వారా చేయిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం బీసీ వ్యతిరేక వైఖరిని నిరసిస్తూ జులై 2న రాష్ట్రవ్యాప్తంగా కాలేజీల బంద్ చేపడతామని, జూలై 15న వేలాదిమంది విద్యార్థులతో ‘చలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని చేపట్టి విద్యార్థుల సత్తాను ప్రభుత్వానికి చూపిస్తామని జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. ఫీజులను విద్యార్థుల వద్ద కళాశాలలు వసూలు చేసుకోవచ్చని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని, విద్యార్థులకు వ్యతిరేకంగా కోర్టు తీర్పులు రావడానికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వమేనని ఆయన ఆరోపించారు.

BC Welfare | బకాయిలు చెల్లించకుండా..

రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్​మెంట్​ పథకాన్ని రద్దు చేయాలని గత రెండేళ్లుగా కుట్ర చేస్తోందని, అందులో భాగంగానే రూ.7000 కోట్ల ఫీజుల బకాయిలు చెల్లించకుండా నానుస్తూ నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ఫీజుల బకాయిలు ప్రభుత్వం చెల్లించకపోవడంతో అనివార్యంగా కాలేజీ యజమాన్యాలు కోర్టుల్లో కేసులు వేశారని, కోర్టుల్లో ప్రభుత్వం తరపున బలమైన వాదనలు వినిపించాల్సి ఉన్న, ‘రోగి కోరుకున్నది అదే, డాక్టర్ ఇచ్చిన మందు అదే’ అన్నట్టు ప్రభుత్వం చేయాలనుకున్న రద్దును కోర్టు తీర్పుల ద్వారా పరోక్షంగా చేపిస్తుందని  తీవ్రంగా మండిపడ్డారు.

 తలాతోక లేని జీవోలు..

రాష్ట్ర ప్రభుత్వం తలాతోక లేకుండా.. విద్యార్థి వ్యతిరేక భావంతో జీవో నెంబర్ 7, 8, 9 లను తీసుకువచ్చి రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులను తీవ్ర గందరగోళానికి గురి చేసిందన్నారు. ఫీజుల బకాయిలు ఎప్పుడు ఇస్తారో చెప్పకుండా, ఒకవైపు ఇంజినీరింగ్, ఫార్మసీ, డిగ్రీ, ఇంటర్ అడ్మిషన్ల సమయంలో విద్యార్థుల నుండి నేరుగా ఫీజులు వసూలు చేసుకోవచ్చని కోర్టు తీర్పులు వస్తుంటే ప్రభుత్వం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్, జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్, దర్శనం దేవేందర్, బుస్సా ఆంజనేయులు, ఆకుల ప్రసాద్, కరిపే రవీందర్, కొయ్యడ శంకర్, శ్రీలత, బగ్గలి అజయ్, చంద్రకాంత్, సత్యప్రకాష్, చంద్రమోహన్, అపర్ణ, రేఖ, గంగాధర్, శ్రీనివాస్, జయ, హన్మాండ్లు తదితరులు పాల్గొన్నారు.

bc1

ఇది కూడా చదవండి: మినీ వ్యాన్ టైర్ల కింద నలిగి చిన్నారి మృతి 

 

 

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *