అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Rice Millers Case | రాష్ట్రంలో అనేక రైస్‌మిల్లులు సీఎంఆర్ బియ్యం విషయంలో అక్రమాలకు పాల్పడ్డాయి. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల నుంచి సేకరించిన ధాన్యాన్ని పక్కదారి పట్టించాయి. ఎఫ్‌సీఐకి బియ్యం ఇవ్వలేదు. అలాంటి రైస్‌మిల్లులపై చర్యలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని దారి మళ్లించి, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థకు బియ్యాన్ని అందించడంలో విఫలమైన రైస్ మిల్లు యజమానులపై కేసులను ముందుకు తీసుకెళ్లేందుకు తెలంగాణ పోలీసులకు సుప్రీంకోర్టు మార్గం సుగమం చేసింది. గతంలో పలువురు మిల్లర్లపై కేసులు నమోదు అయ్యాయి. ఈ ఎఫ్ఐఆర్లను రద్దు చేయాలని వారు హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ నిరాశ ఎదురుకావడంతో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రైస్ మిల్లు యజమానులు దాఖలు చేసిన ప్రత్యేక అనుమతి పిటిషన్లను (ఎస్ఎల్పిలను) విచారణకు అనర్హమైనవిగా సుప్రీంకోర్టు కొట్టివేసింది.
Rice Millers Case | 540 ఎఫ్ఐఆర్లు
ప్రభుత్వం కేటాయించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి పౌరసరఫరాకు అప్పగించడంలో పలు మిల్లర్లు విఫలం అయ్యారు. ఆ బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో విక్రయించారు. అధికారులు పలుమార్లు హెచ్చరించినా.. బియ్యం ఇవ్వడంలో నిర్లక్ష్యం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇలాంటి మిల్లులపై చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 2024లో పౌర సరఫరాల శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదులు చేయడం ప్రారంభించారు. ఇప్పటివరకు, లక్షల మెట్రిక్ టన్నుల ప్రభుత్వ వరి ధాన్యం దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణలపై తెలంగాణ వ్యాప్తంగా 540 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. దీనిపై వారు కోర్టును ఆశ్రయించగా.. అక్కడ చుక్కెదురైంది.
దీనిని కూడా చదవండి : ATM Fraud Arrest | ఏటీఎం మోసాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా నిందితుడి అరెస్ట్