అక్షరటుడే వెబ్‌డెస్క్: RBI ATM Rules | ఏటీఎం నగదు ఉపసంహరణలు, లావాదేవీల నిబంధనలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( RBI ) తాజాగా కీలక సర్క్యూలర్ జారీ చేసింది. ఉచిత లావాదేవీల పరిమితి, అదనపు ఛార్జీలు, పాయింట్ ఆఫ్ సేల్ (PoS) నగదు ఉపసంహరణలు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్ల కార్యకలాపాలపై పూర్తి స్పష్టతనిచ్చింది. బ్యాంక్ ఖాతాదారులందరూ తెలుసుకోవాల్సిన ముఖ్య అంశాలను ఇందులో పొందుపరిచింది.
RBI ATM Rules | ఉచిత లావాదేవీల పరిమితి..
ఖాతాదారులు తమ సొంత బ్యాంక్ ఏటీఎంలలో ఆర్థిక, ఆర్థికేతర లావాదేవీలు అన్నీ కలిపి నెలకు 5 ఉచిత లావాదేవీలు చేసుకోవచ్చు. ఇతర బ్యాంకుల ఏటీఎంల విషయానికొస్తే, మెట్రో నగరాల్లో నెలకు 3 ఉచిత లావాదేవీలు, మెట్రోయేతర ప్రాంతాల్లో 5 ఉచిత లావాదేవీలకు అనుమతి ఉంటుంది.
RBI ATM Rules | విఫలమైన లావాదేవీలు..
ఉచిత లావాదేవీల పరిమితి ముగిసిన తర్వాత నిర్వహించే ప్రతి లావాదేవీకి పన్నులు, ఇతర ఛార్జీలు అన్నీ కలిపి గరిష్ఠంగా రూ. 23 మాత్రమే వసూలు చేయాలి. ఇతర బ్యాంకు ఏటీఎంలలో ఒకే లావాదేవీలో గరిష్ఠంగా రూ. 10 వేల వరకు నగదు తీసుకునే వీలుంటుంది. ఒకవేళ సాంకేతిక లోపాల వల్ల లావాదేవీ విఫలమైనా లేదా ఏటీఎంలో నగదు లేక డబ్బులు రాకపోయినా, దానిని ఉచిత లావాదేవీల కోటాలో లెక్కించరు. అలాంటి వాటికి ఎటువంటి ఛార్జీలు విధించకూడదని ఆర్బీఐ స్పష్టం చేసింది.
RBI ATM Rules | నగదు ఉపసంహరణ..
పాయింట్ ఆఫ్ సేల్ (PoS) టెర్మినళ్ల వద్ద డెబిట్ కార్డులు, కేవైసీ పూర్తి చేసిన ప్రీపెయిడ్ చెల్లింపు సాధనాలు, యూపీఐ ద్వారా నగదు విత్‌డ్రా చేసుకునేందుకు ఆర్బీఐ అనుమతించింది. ఇక్కడ ఒక్కో లావాదేవీకి రూ. 2 వేల నుంచి గరిష్ఠంగా రూ. 10 వేల వరకు పరిమితి ఉంటుంది. ఇలాంటి లావాదేవీలపై ఛార్జీలు విధిస్తే, అది లావాదేవీ మొత్తంలో ఒక శాతానికి మించకూడదు.
RBI ATM Rules | సెమీ అర్బన్ ప్రాంతాలకు..
బ్యాంకింగేతర సంస్థలు నిర్వహించే వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లకు ఆర్బీఐ కీలక ఊరట కల్పించింది. ఇంటర్ఆపరేబుల్ కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయల్ (ICCW) సేవలను అందించడానికి వీరికి అనుమతి ఇచ్చింది. ఈ లావాదేవీల సెటిల్మెంట్ నేషనల్ ఫైనాన్షియల్ స్విచ్ లేదా అధీకృత ఏటీఎం నెట్‌వర్క్‌ల ద్వారా జరగాలని పేర్కొంది. అలాగే వైట్ లేబుల్ ఆపరేటర్లు తమ స్పాన్సర్డ్ బ్యాంకుల నుంచే కాకుండా ఇతర రుణదాతల నుంచి కూడా నగదును సమకూర్చుకోవచ్చని తెలిపింది. కొత్త ఏటీఎంల ఏర్పాటులో గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆర్బీఐ సూచించింది.
ఇది కూడా చదవండి: Delimitation Bill | డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు