అక్షరటుడే, కామారెడ్డి: TRTF | పీఆర్టీయూ సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్ రెడ్డి సుమారు 500 మంది అనుచరులు, ఉపాధ్యాయులతో కలిసి తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్లో చేరారు. కామారెడ్డి పట్టణంలోని గెలాక్సీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన భారీ సభలో రాష్ట్ర నాయకత్వం ఆయనకు ఘన స్వాగతం పలికారు. టీఆర్టీఎఫ్ రాష్ట్ర సంఘ ముఖ్య సలహాదారుడిగా నియమించారు.
TRTF | సంఘం మరింత బలోపేతం
ఈ సందర్భంగా టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేష్, ప్రధాన కార్యదర్శి మారెడ్డి అంజిరెడ్డి మాట్లాడారు. చిత్తశుద్ధి కలిగిన పులగం దామోదర్ రెడ్డికి సంఘంలో సముచిత స్థానం కల్పిస్తామని పేర్కొన్నారు. ఆయన రాకతో సంఘం మరింత బలోపేతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. దామోదర్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో మాదిరిగానే నిత్యం ఉపాధ్యాయులకు అందుబాటులో ఉంటానన్నారు. హక్కుల సాధన, సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేస్తానని స్పష్టం చేశారు.
TRTF | సమస్యల పరిష్కారానికి కృషి
ముఖ్యంగా ఉమ్మడి సర్వీస్ రూల్స్ అమలు, రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయులందరికీ పాత పెన్షన్ విధానం, ఇతర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అంజిరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో టీఆర్టీఎఫ్ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి ఐలయ్య, రాష్ట్ర మెంబర్ షిప్ కమిటీ కన్వీనర్ షుంకిశాల ప్రభాకర్ రావు, వివిధ జిల్లాల టీఆర్టీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Manjeera Checkdams | మంజీర చెక్డ్యాంలతో పెరిగిన భూగర్భ జలాలు : పోచారం శ్రీనివాసరెడ్డి