అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Heavy Rain Alert | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) అధికారులు తెలిపారు. గత వారం రోజులుగా హీట్‌వేవ్ (Heatwave)తో అల్లాడుతున్న ప్రజలకు ఉక్కపోత నుంచి ఉపశమనం లభించనుంది.
రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే రెండు రోజులుగా అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం నిజామాబాద్ (Nizamabad) జిల్లాలోని పలు గ్రామాల్లో వాన దంచికొట్టింది. హైదరాబాద్ (Hyderabad)లో సైతం వర్షం పడింది. ఆదివారం సైతం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని అధికారులు పేర్కొన్నారు.
Heavy Rain Alert | సాయంత్రం పూట..
రాష్ట్రంలో ఆదివారం మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత అధికంగా ఉండనుంది. చాలా ప్రాంతాల్లో 42 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి. మధ్యాహ్నం తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోనుంది. మధ్యాహ్నం నుండి రాత్రి వరకు సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్ (Medak), కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట, జగిత్యాల, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో మధ్యాహ్నం వరకు 41-42 డిగ్రీల ఉష్ణోగ్రతలు, సాయంత్రం నుంచి రాత్రి వరకు చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Heavy Rain Alert | రైతులు జాగ్రత్త
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసిపోయింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రస్తుతం వరి కోతలు చివరి దశకు వచ్చాయి. అన్నదాతలను వడ్లను ఆరబెడుతున్నారు. మరోవైపు కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. పలు గ్రామాల్లో ఇంకా కాంటాలు ప్రారంభం కాలేదు. ఈ సమయంలో వర్షాలు పడితే ధాన్యం తడిసి నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేడు భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో రైతులు అప్రమత్తంగా ఉండాలి. ధాన్యం, ఇతర పంటలు తడిసిపోకుండా టార్పాలిన్లు కప్పుకోవాలని అధికారులు సూచించారు.

దీనిని కూడా చదవండి : Rythu Bharosa | రైతులకు గుడ్‌న్యూస్.. 20న రెండో విడత రైతుభరోసా

