అక్షరటుడే, వెబ్‌డెస్క్: T-SAT Education Department | తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ నెట్‌వర్క్ ‘టీ-శాట్’ (T-SAT) నిర్వహణలో కీలక మార్పు చోటుచేసుకుంది. ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) & కమ్యూనికేషన్ శాఖ కింద ఉన్న టీ-శాట్ సబ్జెక్టును విద్యాశాఖకు బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని సర్కారు స్పష్టం చేసింది.
T-SAT Education Department | సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని..
దశాబ్ద కాలంగా ఐటీ శాఖ పర్యవేక్షణలో కొనసాగుతున్న టీ-శాట్ ఛానెళ్లను (విద్యా, నిపుణ), విద్యావ్యవస్థలో మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ మార్పు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పాఠశాల, ఇంటర్మీడియట్ మరియు ఉన్నత విద్యా విభాగాలకు సంబంధించిన పాఠ్యాంశాల ప్రసారాలు, అభ్యర్థులకు శిక్షణ వంటి అంశాలు నేరుగా విద్యాశాఖ పరిధిలో ఉండటం వల్ల సమన్వయం సులభతరం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
T-SAT Education Department | కీలక మార్పులు
టీ-శాట్ నెట్‌వర్క్ ఇకపై విద్యాశాఖ ఆధ్వర్యంలో పని చేస్తుంది. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యార్థులకు డిజిటల్ పాఠాలు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు నాణ్యమైన కోచింగ్ అంశాలపై విద్యాశాఖ ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాల్సి ఉంటుంది.
ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ లెర్నింగ్‌ను పటిష్టం చేయడంలో భాగంగా టీ-శాట్ సేవలను విద్యార్థులకు మరింత చేరువ చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విద్యా విధానంలో చేపడుతున్న సంస్కరణల్లో భాగంగానే ఈ బదిలీ ప్రక్రియ జరిగినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. టీ-శాట్ ద్వారా అందించే విద్యా సేవలను మరింత నాణ్యంగా, శాస్త్రీయంగా రూపొందించడానికి విద్యాశాఖలోని నిపుణులు ఇకపై నేరుగా పర్యవేక్షించే అవకాశం ఉంది.

