అక్షరటుడే వెబ్‌డెస్క్: Komatireddy Rajagopal Reddy | తెలంగాణ కాంగ్రెస్ రాజకీయంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మంత్రివర్గంలో చోటు లభిస్తుందని ఆశించిన ఆయనకు నిరీక్షణ తప్పకపోవడంతో పాటు, నియోజకవర్గానికి నిధులు విడుదల కావడం లేదంటూ సొంత ప్రభుత్వంపైనే ఆయన బహిరంగంగా తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కారు. గట్టుప్పల్ మండల పర్యటనలో ఆయన మాట్లాడిన మాటలు కాంగ్రెస్ వర్గాల్లో కొత్త కలకలం సృష్టించాయి.
Komatireddy Rajagopal Reddy | మంత్రి పదవి ఇస్తామని చెప్పి ..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేబినెట్లో స్థానం దక్కుతుందని రాజగోపాల్ రెడ్డి భావించారు. అయితే ఇప్పటివరకు పదవి ఇవ్వకపోవడంపై స్పందిస్తూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy ), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కల వద్దకు స్వయంగా వెళ్లినప్పటికీ తన నియోజకవర్గానికి నిధులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు మంత్రి పదవి ఇస్తామని చెప్పి మోసం చేశారని, కేబినెట్ పదవి ఇస్తే ఎక్కడ ప్రాధాన్యం పెరిగిపోతుందోననే ఉద్దేశంతోనే పక్కన పెట్టారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Komatireddy Rajagopal Reddy | కష్టపడి గెలిపిస్తే మోసం..
అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ నిధుల కోసం ప్రతిపక్ష నేతలా ప్రభుత్వంపై కొట్లాడాల్సి వస్తోందని ఆయన మండిపడ్డారు. రోడ్ల నిర్మాణానికి సంబంధించి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు మధ్యలోనే ఆగిపోతున్నాయని, జీతాలు, రైతుబంధు వంటి పథకాలకే ప్రభుత్వం నిధుల కొరత ఎదుర్కొంటోందన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరించకపోతే పదవులను పట్టుకుని వేలాడబోనని, అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. గతంలో ఎంతో కష్టపడి పలువురిని ఎమ్మెల్యేలుగా గెలిపిస్తే వారంతా తనను మోసం చేశారని, తాను ఎవరికీ భయపడేది లేదని ధ్వజమెత్తారు.
Komatireddy Rajagopal Reddy | మళ్లీ మొదలైన అంతర్గత పోరు..
ఇప్పటికే రేడియల్ రోడ్ల టెండర్ల వ్యవహారంలో తన కుటుంబ కంపెనీని పక్కన పెట్టారంటూ ప్రభుత్వంపై న్యాయపోరాటానికి దిగిన రాజగోపాల్ రెడ్డి, తాజాగా ఎమ్మెల్యే పదవి త్యాగం చేస్తాననడం రేవంత్ సర్కార్‌పై ఒత్తిడి పెంచే వ్యూహంగా కనిపిస్తోంది. గతంలో సీఎం రేవంత్ రెడ్డితో విభేదాలు తారస్థాయికి చేరి మళ్లీ సద్దుమణిగాయని భావించిన తరుణంలో, ఈ కొత్త వ్యవహారం మళ్లీ ‘ఢీ అంటే ఢీ’ అనే పరిస్థితిని తెచ్చిపెట్టింది. ఇటీవల ఇతర ఎమ్మెల్యేలు నిధులపై మాట్లాడినప్పుడు పీసీసీ సీరియస్ అయి క్రమశిక్షణా చర్యలు హెచ్చరించిన నేపథ్యంలో, ఇప్పుడు సీనియర్ నేత రాజగోపాల్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలపై అధిష్ఠానం ఎలా స్పందిస్తుందోననేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
ఇది కూడా చదవండి: Congress Party Controversy | కాంగ్రెస్ పార్టీలో కలకలం.. ఎమ్మెల్యేపై మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు!