అక్షరటుడే, వెబ్‌డెస్క్: NEET Paper Leak | దేశంలో అత్యున్నత వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (NEET UG) పరీక్ష వ్యవహారం ఇప్పుడు పెను దుమారం రేపుతోంది.
లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ ప్రతిష్టాత్మక పరీక్ష పేపర్ లీకేజీ వెనుక ఒక పక్కా ప్రణాళికాబద్ధమైన అంతరాష్ట్ర ముఠా నెట్‌వర్క్ దాగి ఉందనే చేదు నిజం విచారణలో బట్టబయలైంది. చదువును వ్యాపారంగా మార్చేస్తూ, అర్హులైన పేద విద్యార్థుల కలలను ఈ మాఫియా ఎలా చిదిమేస్తోందో ఈ ఉదంతం కళ్లకు కడుతోంది.
NEET Paper Leak | సీకర్ కేంద్రంగా సాగిన నెట్‌వర్క్ విస్తరణ
ఈ లీకేజీ వ్యవహారంలో ప్రధాన సూత్రధారులుగా రాజస్థాన్‌లోని సీకర్ పట్టణాన్ని కేంద్రంగా చేసుకుని అక్రమ నెట్‌వర్క్ విస్తరించినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.
ఈ అక్రమ నెట్‌వర్క్‌కు అడ్డాగా మారిన రాజస్థాన్‌లోని సీకర్, ఢిల్లీ, కాశ్మీర్, బీహార్ వంటి ప్రాంతాల్లో కోచింగ్ సెంటర్లు, ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ఏజెంట్లు ఒక వ్యవస్థలాగా ఏర్పడి ఈ దందా సాగించినట్లు విచారణలో తేలింది.
NEET Paper Leak | ప్రెస్ నుంచే లీక్
ఈ కుంభకోణంలో అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే, మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న ఒక ప్రముఖ ప్రింటింగ్ ప్రెస్ నుంచే నీట్ ఎగ్జామ్ పేపర్ నేరుగా లీక్ అయినట్లు వెలుగులోకి వచ్చింది.
భద్రతా నడుమ గోప్యంగా ఉంచాల్సిన పరీక్ష పత్రం, ముద్రణాలయం నుంచే బయటకు రావడం అనేది విద్యా వ్యవస్థలోని లొసుగులను, పర్యవేక్షణా లోపాలను వేలెత్తి చూపుతోంది. ఈ వ్యవహారంలో నాసిక్ ప్రింటింగ్ ప్రెస్‌కు చెందిన ఒక కీలక వ్యక్తిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.
NEET Paper Leak | ఎంతకు అమ్ముడుపోయింది? హాస్టల్ యజమాని పాత్రేంటి?
ఈ దందాలో పేపర్లు ఊరికే లీక్ అవ్వలేదు; దీని వెనుక కోట్ల రూపాయల చేతులు మారాయి. తొలుత ఈ గ్యాస్ పేపర్‌ను ఏకంగా రూ.28 లక్షల భారీ ధరకు విక్రయించినట్లు విచారణలో తేలింది.
ఈ నెట్‌వర్క్‌లో ఒక కెమిస్ట్రీ టీచర్ కీలక పాత్ర పోషించగా, అతనికి సహకరించిన ఒక హాస్టల్ యజమానిని స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) అదుపులోకి తీసుకుని విచారించింది.
పరీక్షకు ముందు రోజే విద్యార్థులను ఒక రహస్య హాస్టల్‌లో ఉంచి, లీకైన పేపర్‌తో సమాధానాలను బట్టీ పట్టించినట్లు సదరు హాస్టల్ యజమాని ఒప్పుకోవడం విద్యావ్యవస్థను నివ్వెరపరుస్తోంది.
NEET Paper Leak | వ్యవస్థాగత వైఫల్యంపై విమర్శలు
జమ్మూ కాశ్మీర్ నుండి ఆంధ్రప్రదేశ్ వరకు విస్తరించిన ఈ భారీ నెట్‌వర్క్‌ను ఛేదించడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విఫలమైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇంత పెద్ద ఎత్తున వాట్సాప్ గ్రూపుల ద్వారా, రహస్య ఏజెంట్ల ద్వారా పేపర్ చేతులు మారుతున్నా ఇంటెలిజెన్స్ బ్యూరో లేదా బోర్డు ముందే ఎందుకు గుర్తించలేకపోయాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తీవ్ర ఒత్తిడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) కి అప్పగించింది.
కంటిపై కునుకు లేకుండా, రాత్రింబగళ్లు కష్టపడి చదివే ప్రతిభావంతులైన విద్యార్థులకు ఇటువంటి లీకేజీలు శాపంగా మారుతున్నాయి. డబ్బున్న వారికే సీట్లు దక్కేలా విద్యా మాఫియా చేస్తున్న ఇటువంటి కుట్రలను ఇప్పుడైనా ఉక్కుపాదంతో అణచివేయకపోతే దేశంలో వైద్య విద్యా ప్రమాణాలు పూర్తిగా దిగజారిపోయే ప్రమాదం ఉంది. కేంద్ర దర్యాప్తు సంస్థలైనా ఈ నెట్‌వర్క్ వెనుక ఉన్న అసలైన “పెద్దల” ముసుగులు తొలగించి బాధ్యులను కఠినంగా శిక్షిస్తాయని ఆశిద్దాం.

