Kakinada Tipper Accident | ఉపాధి పనులకు వెళ్లి మృత్యువాత.. కాకినాడలో టిప్పర్ బీభత్సం, నలుగురు మహిళా కూలీల దుర్మరణం

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kakinada Tipper Accident | తెల్లవారితే చాలు కష్టపడి పని చేసి కుటుంబాన్ని పోషించుకోవాల్సిన పేద కుటుంబాల జీవితాల్లో శనివారం ఉదయం విషాదం అలుముకుంది. ప్రతిరోజులాగే పొట్టకూటి కోసం ఉపాధి హామీ పనులకు వెళ్లేందుకు ఇళ్ల నుంచి బయటకు వచ్చిన మహిళా కూలీలు, కాసేపటికే రక్తపు మడుగులో పడి కనిపించడం స్థానికులను కలచివేసింది.

కాకినాడ జిల్లా (Kakinada District)లో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడ రూరల్ పరిధిలోని కొవ్వూరు బ్రిడ్జి సమీపంలో శనివారం (మే 16, 2026) తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఉపాధి హామీ పనుల్లో పాల్గొనేందుకు కొందరు మహిళా కూలీలు ఇళ్ల నుంచి బయలుదేరారు. వారు కొవ్వూరు బ్రిడ్జి వద్ద రోడ్డు దాటుతుండగా.. అదే సమయంలో అటుగా అత్యంత వేగంగా వచ్చిన టిప్పర్ లారీ నియంత్రణ కోల్పోయి కూలీలపైకి దూసుకెళ్లింది.

Kakinada Tipper Accident | అతి వేగ‌మే కార‌ణ‌మా?

లారీ వేగం తీవ్రంగా ఉండటంతో ఢీకొన్న ప్రభావానికి కూలీలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు. లారీ Lorry చక్రాలు వారి మీదుగా వెళ్లడంతో అక్కడికక్కడే నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు మాత్రం ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని వాసంశెట్టి సత్యవతి (60), పాలిక కృష్ణవేణి (35), చిట్టెమ్మ (45), చెల్లూరి అన్నవరం (45)గా పోలీసులు గుర్తించారు. ఒకే ప్రాంతానికి చెందిన ఈ మహిళల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మట్టపర్తి అరుణ కుమారి, పాలిక నాగమణిలను స్థానికులు, పోలీసులు వెంటనే కాకినాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (GGH)కి తరలించారు. ప్రస్తుతం వారికి అత్యవసర విభాగంలో చికిత్స అందుతుండగా, వారి ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించినట్లు సమాచారం.

Kakinada Tipper Accident | ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు

ఘటన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఉపాధి పనులకు వెళ్లిన తమ కుటుంబ సభ్యులు కొద్దిసేపటికే శవాలుగా కనిపించడం చూసిన బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. వారి రోదనలు అక్కడి వాతావరణాన్ని హృదయవిదారకంగా మార్చాయి. ఈ ప్రమాదానికి అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ లారీ డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాదానికి కారణమైన డ్రైవర్ కోసం దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Vijayawada Doctor Case | విజయవాడలో సంచలనం.. పెళ్లి విషయం దాచిపెట్టి నర్సును మోసం చేశాడన్న ఆరోపణలు.. వైద్యుడిపై కేసు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *