Laddu Adulteration Case | శ్రీవారి లడ్డూ కల్తీ కేసులో ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం.. హై లెవెల్ కమిటీ ఏర్పాటు

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Laddu Adulteration Case | తిరుమల (Tirumala) శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ఈ వివాదంపై ఇప్పటికే విచారణ జరిపిన వన్ మెన్ కమిటీ సమర్పించిన నివేదికను సమగ్రంగా పరిశీలించేందుకు, తదుపరి చర్యలు తీసుకునేందుకు ముగ్గురు ఉన్నతాధికారులతో కూడిన హై లెవెల్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. కోట్లాది మంది భక్తుల విశ్వాసంతో ముడిపడి ఉన్న ఈ అంశాన్ని అత్యంత సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను వెలికితీసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది.

Laddu Adulteration Case | ముగ్గురు సభ్యులతో ఉన్నత స్థాయి కమిటీ

ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. కమిటీలో సభ్యులుగా రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, రాష్ట్ర న్యాయ శాఖ కార్యదర్శి ఉంటారు. లడ్డూ తయారీలో వాడిన నెయ్యి నాణ్యత, సరఫరా విధానం, టెండర్ల కేటాయింపులో జరిగిన ఉల్లంఘనలు, పరిపాలనా లోపాలు వంటి అంశాలను కమిటీ క్షుణ్ణంగా పరిశీలించనుంది. ఏకసభ్య కమిషన్ చైర్మన్ దినేష్ కుమార్ సమర్పించిన నివేదికలో పేర్కొన్న కీలక అంశాలను లోతుగా అధ్యయనం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

Laddu Adulteration Case | ఎలాంటి నియంత్రణ చర్యలు తీసుకోవాలి?

ఈ విచారణను వేగవంతం చేయాలని ప్రభుత్వం స్పష్టమైన సూచనలు చేసింది. కేవలం వారం రోజుల్లోనే సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేయాలని ముఖ్యమంత్రి కార్యాలయం కమిటీకి ఆదేశాలు జారీ చేసింది. వన్ మెన్ కమిటీ నివేదిక ఆధారంగా ఎవరిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి? ఏ శాఖల్లో నిర్లక్ష్యం జరిగింది? భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఎలాంటి నియంత్రణ చర్యలు తీసుకోవాలి? అనే అంశాలపై కమిటీ స్పష్టమైన సిఫార్సులు చేయనుంది. శ్రీవారి లడ్డూ ప్రసాదం పవిత్రతకు భంగం కలిగించిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టబోమని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యి సరఫరాలో రాజకీయ జోక్యం, అర్హతలేని సంస్థలకు కాంట్రాక్టులు కట్టబెట్టడం వంటి ఆరోపణలపై కూడా కమిటీ దృష్టి సారించనుంది. ఈ కమిటీ నివేదిక ఆధారంగా బాధ్యులైన అధికారులతో పాటు గత పాలక మండలి సభ్యులపై కూడా కఠిన చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

హై లెవెల్ కమిటీ నివేదిక ద్వారా లడ్డూ ప్రసాదం వ్యవహారంలో జరిగిన లోపాలను బహిర్గతం చేసి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన నిబంధనలు అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారం రోజుల్లో కమిటీ నివేదిక రానుండటంతో తదుపరి ప్రభుత్వ నిర్ణయాలపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

ఇది కూడా చదవండి..: SVSN Varma | వర్మకు షాక్.. ఇంఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించిన టీడీపీ అధిష్టానం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *