అక్షరటుడే, వెబ్డెస్క్: SVSN Varma | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో కీలకమైన పిఠాపురం నియోజకవర్గం మరోసారి వార్తల్లో నిలిచింది. పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) కీలక మార్పులు చేపట్టినట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
పిఠాపురం టీడీపీ ఇంఛార్జ్ బాధ్యతల నుంచి వర్మను అధిష్టానం తప్పించినట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అదే సమయంలో పిఠాపురం నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాలను సమన్వయం చేసేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసే దిశగా టీడీపీ అడుగులు వేస్తోందని తెలుస్తోంది.
SVSN Varma | వర్మ-జనసేన విభేదాలే కారణమా?
ఇటీవల కాలంలో పిఠాపురం (Pithapuram) కేంద్రంగా టీడీపీ, జనసేన నాయకుల మధ్య పలు వివాదాలు తెరపైకి రావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో నారా చంద్రబాబు నాయుడు ఫోటోలు లేకపోవడంపై వర్మ పలుమార్లు జనసేన నేతలతో వాగ్వాదానికి దిగిన ఘటనలు పెద్ద దుమారమే రేపాయి.గత నెలలో కూడా ప్రభుత్వ కార్యక్రమానికి సంబంధించిన ఫ్లెక్సీల్లో చంద్రబాబు (Chandrababu) ఫోటో లేదని వివాదం చెలరేగింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, వర్మ మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కూటమి ప్రభుత్వంలో ఇలాంటి విభేదాలు బయటపడటం టీడీపీ అధిష్టానాన్ని అసంతృప్తికి గురిచేసినట్లు సమాచారం.
SVSN Varma | వర్మ కేవలం మూడు రోజుల క్రితమే ఏపీ మంత్రి
ఈ ఘటనల తర్వాత చంద్రబాబు స్వయంగా స్పందిస్తూ.. “ఫ్లెక్సీల్లో ఫోటోలు లేవని, కుర్చీలు వేయలేదని తరచూ వివాదాలు సృష్టించడం సరికాదు” అంటూ కూటమి నేతలకు గట్టి సూచనలు చేసిన విషయం తెలిసిందే. కూటమి ఐక్యత దెబ్బతినేలా ఎవరూ వ్యవహరించవద్దని ఆయన హెచ్చరించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. వర్మ కేవలం మూడు రోజుల క్రితమే ఏపీ మంత్రి, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ను కలిశారు.
ఆ సమావేశం తర్వాత కూడా పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయని భావించిన సమయంలోనే ఆయనను ఇంఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించినట్లు ప్రచారం జరగడం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ అయింది.టీడీపీ అధిష్టానం ముందుగానే ఈ విషయాన్ని వర్మకు తెలియజేసిందన్న ప్రచారం కూడా జరుగుతోంది. అయితే దీనిపై వర్మ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.
ఇది కూడా చదవండి..: TTD Board Decisions | వీఐపీ సిఫారసు లేఖలు రద్దు.. టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు