అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bandi Bhagirath POCSO | రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన పొక్సో (POCSO) కేసులో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ విచారణ కీలక ఘట్టానికి చేరుకుంది.
పేట్ బషీర్‌బాగ్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు ఆయనను సుదీర్ఘంగా విచారించారు. కేసు తీవ్రత దృష్ట్యా ప్రత్యేక బృందాలు పలు అంశాలపై భగీరథ్ నుంచి వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. గంటల తరబడి సాగిన ఈ విచారణ ఎట్టకేలకు ముగిసింది.
Bandi Bhagirath POCSO | ప్రభుత్వ ఆసుపత్రికి..
విచారణ పూర్తి కావడంతో, చట్టపరమైన నిబంధనల ప్రకారం బండి భగీరథ్‌కు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు పోలీసులు మేడ్చల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కట్టుదిట్టమైన భద్రత నడుమ పోలీసు వాహనాల కాన్వాయ్‌లో ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు పూర్తి కాగానే.. ఆ నివేదికలతో పాటు భగీరథ్‌ను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉంది.
Bandi Bhagirath POCSO | మెజిస్ట్రేట్ నివాసం వద్ద ‘హై అలర్ట్’..
ఈ పరిణామాల నేపథ్యంలో మేడ్చల్ పరిసరాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వైద్య పరీక్షల అనంతరం భగీరథ్‌ను మెజిస్ట్రేట్ నివాసంలో హాజరుపరిచే అవకాశం ఉండటంతో, సదరు కాలనీలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
మెజిస్ట్రేట్ నివాసం ఉండే కాలనీకి వచ్చే అన్ని దారులను పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా కాలనీలోకి ఎలాంటి ప్రైవేటు వాహనాలను అనుమతించడం లేదు.
అధికార, ప్రతిపక్షాలకు సంబంధించిన కీలక కేసు కావడంతో అటు పోలీసులు, ఇటు రాజకీయ వర్గాల్లో ఏం జరగబోతోందనే ఉత్కంఠ నెలకొంది.
వైద్య పరీక్షల నివేదిక వచ్చిన వెంటనే మెజిస్ట్రేట్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? రిమాండ్ విధిస్తారా.. లేక తదుపరి ఆదేశాలు ఇస్తారా.. అనేది మరికొద్ది సేపట్లో తేలనుంది.


