అక్షరటుడే, కామారెడ్డి: Interstate Thief Arrest | కామారెడ్డిలో చోరీలకు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి భారీగా బంగారు ఆభరణాలు(gold robbery), వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు సోమవారం ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh chandra) వివరాలు వెల్లడించారు.
Interstate Thief Arrest | కామారెడ్డి పట్టణంలో..
ఎస్పీ కథనం ప్రకారం.. గతనెల 11న కామారెడ్డి పట్టణంలోని విద్యానగర్ కాలనీలోని శ్రీసాయి రెసిడెన్సీ అపార్టుమెంట్లో నివాసం ఉంటున్న అడ్డగుళ్ల బాలకృష్ణ వైద్య పరీక్షల నిమిత్తం భార్యతో హైదరాబాద్(Hyderabad) వెళ్లాడు. అయితే ఉదయం అపార్ట్మెంట్ వాచ్‌మన్ బాలకృష్ణ ఫోన్ చేసి మీ తాళం పగులగొట్టి ఉందని చెప్పడంతో హుటాహుటిన ఇంటికి చేరుకున్నాడు. ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరగా ఉండటంతో 33.3 తులాల బంగారు ఆభరణాలు, 10.29 కిలోల వెండి వస్తువులు, రూ.లక్ష నగదు చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో డీఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం విచారణ చేపట్టింది. నెల రోజులుగా సుమారు 200 సీసీ కెమెరాలను పరిశీలించి చోరీకి పాల్పడిన వ్యక్తి కదలికలను గమనించారు.
Interstate Thief Arrest | రెక్కీ నిర్వహిస్తూ.. చోరీలు చేస్తూ..
పోలీసుల విచారణలో నిందితుడు కామారెడ్డి(Kamareddy), హైదరాబాద్, కరీంనగర్, గోవా(Goa), ముంబయి, బెంగళూరు సంచరిస్తూ తాళం వేసిన ఇళ్లపై రెక్కీ చేసి చోరీలకు పాల్పడుతున్నట్టుగా తేలింది. నిందితుడిపై నిఘా పెట్టిన పోలీసులు చోరీ చేసిన ఆభరణాలు విక్రయించేందుకు హైదరాబాద్ నుంచి ముంబై ప్రైవేట్ బస్సులో వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. జాతీయ రహదారిపై వెళ్తున్న బస్సులో నిందితున్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పోలీసుల విచారణలో నిందితుడు కరీంనగర్ పట్టణానికి చెందిన ఠాకూర్ జగన్ అలియాస్ దినేష్ సింగ్ అలియాస్ డీజే డాని అలియాస్ దినేష్ రాజ్ పురోహిత్‌గా గుర్తించారు. చోరీ చేసిన వస్తువులను కరిగించి అమ్మడం, ఫైనాన్స్‌లో కుదువ పెట్టి వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవాడు. నిందితుడిపై కరీంనగర్ జిల్లాలో 15 కేసులు, సైబరాబాద్ పరిధిలో 10, వరంగల్ జిల్లాలో 4, నిజామాబాద్ జిల్లాలో 1, రామగుండం కమిషనరేట్ పరిధిలో 1, సంగారెడ్డి జిల్లాలో 1 కేసు ఉందని ఎస్పీ తెలిపారు. అలాగే కాకినాడ, మేడిపల్లి పరిధిలో నేరాలు చేసినట్టుగా సమాచారం ఉందన్నారు. నిందితుని వద్ద నుంచి 14.5 తులాల బంగారం, 5.7 కిలోల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసును ఛేదించిన పోలీసు సిబ్బందికి ఎస్పీ చేతుల మీదుగా రివార్డు అందజేశారు.
Interstate Thief Arrest | రూ.2 వేల విలువ చేసే సీసీ కెమెరా లేదు
చోరీ జరిగిన బాధితునికి లక్షల్లో ప్రాపర్టీ ఉన్నా కేవలం రూ.2వేల విలుల చేసే చిన్న సీసీ కెమెరా లేదని ఎస్పీ తెలిపారు. సీసీ కెమెరా ప్రతిఒక్కరు తమ ఇళ్లల్లో ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అపార్టుమెంట్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని నోటీసులు ఇచ్చామన్నారు. మార్కెట్లో తక్కువ ధరలో సీసీ కెమెరాలు లభిస్తున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో డీఎస్పీ మధుసూదన్, టౌన్ సీఐ నరహరి, సీసీఎస్ సీఐ రామన్, ఎస్సై ఉస్మాన్ పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Kodagu Elephant Clash | ఏనుగుల ఘర్షణ.. మహిళ మృతి


