అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Akunuri Murali Resignation | రాష్ట్రంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. విద్యా కమిషన్ ఛైర్మన్ పదవికి మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి (Akunuri Murali) రాజీనామా చేశారు. మరో నాలుగు నెలల పదవీ కాలం ఉండగానే ఆయన రిజైన్ చేయడం గమనార్హం.
ఆకునూరి మురళి 2006 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ (IAS) అధికారి. ఆయన పలు జిల్లాలకు కలెక్టర్లుగా పని చేశారు. వివిధ కీలక పదవులు నిర్వహించారు. ఆయన 2019 జూలైలో స్వచ్ఛంద విరమణ (VRS) కోసం దరఖాస్తు చేసి, 2019 ఆగస్టు 31 నుంచి సేవల నుంచి తప్పుకున్నారు.ఆ సమయంలో తెలంగాణ స్టేట్ ఆర్కైవ్స్ డైరెక్టర్‌గా పనిచేస్తూ, తగిన బాధ్యతలు ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో విద్యాశాఖ సలహాదారుగా కూడా పనిచేశారు.
Akunuri Murali Resignation | కాంగ్రెస్ వచ్చాక..
ఆకునూరు మురళి గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. విద్యా వ్యవస్థపై ఆయన పోరాటం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆయనను విద్యా కమిషన్ ఛైర్మన్‌గా నియమించింది. 2024 సెప్టెంబర్ 3న ప్రభుత్వం విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కమిషన్ ఛైర్మన్‌గా సెప్టెంబర్ 6న మురళిని నియమించింది. ఆయన పదవీ కాలం రెండేళ్లుగా పేర్కొంది. దీంతో 2026 సెప్టెంబర్ 2 వరకు ఆయన పదవిలో కొనసాగే అవకాశం ఉంది. అయినా కూడా శుక్రవారం మురళి రాజీనామా చేశారు.
Akunuri Murali Resignation | పని పూర్తి కావడంతో..
ఆకునూరి మురళి తన రాజీనామాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు పంపించారు. తనకు అప్పగించిన పనిని పూర్తి చేసినందున విద్యా కమిషన్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, విద్యా ప్రమాణాల మెరుగుదలపై ఆయన ఎంతోకాలంగా పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో కమిషన్ ఛైర్మన్ అయ్యాయ ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని సూచించారు. అంతేగాకుండా పలు కీలక సంస్కరణలను నివేదికలో పొందుపరిచారు. ప్రభుత్వం వాటిని అమలు చేయలేదు. అయితే తాజాగా ఆయన రాజీనామా ఎందుకు చేశారనే దానిపై చర్చ జరుగుతోంది. పని పూర్తయిందని రాజీనామా చేశారా.. లేఖ ఇంకా ఏమైనా కారణం ఉందా అనేది తెలియాల్సి ఉంది.
దీనిని కూడా చదవండి : ADE Bribery Arrest | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏడీఈ


