అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ACB Case | ఇంటి పర్మిషన్ కోసం లంచం డిమాండ్ చేసిన పంచాయతీ కార్యదర్శిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన మంచిర్యాల (Mancherial) జిల్లాలో చోటు చేసుకుంది.
మంచిర్యాల జిల్లా జన్నారం (Jannaram) మండలం లింగాయిపల్లి గ్రామంలో ఓ వ్యక్తి ఇంటి నిర్మాణం చేపట్టాడు. దాని పర్మిషన్, ఇంటి నంబర్ కోసం పంచాయతీ కార్యదర్శి జె. వరలక్ష్మిని కలిశాడు. దీని కోసం ఆమె రూ.20 వేల లంచం డిమాండ్ చేసింది. చర్చల అనంతరం ఆ మొత్తాన్ని రూ.13 వేలకు తగ్గించింది. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అయితే పంచాయతీ కార్యదర్శి వరలక్ష్మి నేరుగా డబ్బులు తీసుకోలేదు. మరో పంచాయతీ కార్యదర్శి లావణ్య ఫోన్‌పే అకౌంట్‌కు డబ్బులు పంపాలని సూచించింది. దీంతో ఫిర్యాదుదారు ఆమె చెప్పిన నంబర్‌కు రూ.13 వేలు పంపించాడు. ఈ సమయంలో ఏసీబీ అధికారులు పంచాయతీ కార్యదర్శి వరలక్ష్మిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆమెపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
ACB Case | మారని తీరు
రాష్ట్రంలో అవినీతి రాజ్యం ఏలుతోంది. కారోబార్ నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి అధికారుల వరకు లంచాలు తీసుకుంటున్నారు. పనుల కోసం వచ్చే వారిని పైసల కోసం వేధిస్తున్నారు. డబ్బులు ఇస్తేనే పనులు చేస్తున్నారు. ఇటీవల ఏసీబీ అధికారులు నిత్యం దాడులు చేస్తున్నారు. అయినా లంచాలకు మరిగిన అధికారులు భయపడటం లేదు. ముఖ్యంగా గ్రామాల్లో ఇంటి పర్మిషన్, డెత్ సర్టిఫికెట్, ఇతర పనుల కోసం పంచాయతీ కార్యదర్శులు భారీగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే పనులు చేయకుండా కొర్రీలు పెడుతున్నారు.
దీనిని కూడా చదవండి : Rayadurgam Land Price | ఎకరాకు రూ.264 కోట్లు.. రాయదుర్గంలో రికార్డు ధర