అక్షరటుడే వెబ్‌డెస్క్: Afghanistan Flash Floods | తూర్పు అఫ్గానిస్తాన్‌లో సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని నింపాయి. ఈ ప్రాకృతిక విపత్తు కారణంగా 20 మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 80 మందికి పైగా గాయపడ్డారు. మరో 100 మందికి పైగా గల్లంతైనట్లు అఫ్గాన్ అధికారులు వెల్లడించారు.
Afghanistan Flash Floods | నూరిస్తాన్ ప్రావిన్స్‌లో తీవ్ర నష్టం..
తూర్పు ప్రావిన్స్‌లోని నూరిస్తాన్ ( Nuristan )ప్రాంతాన్ని వరదలు పూర్తిగా ముంచెత్తాయి. ముఖ్యంగా పరున్ నగరం, దాని చుట్టుపక్కల ప్రాంతాలు భారీ వరదల వల్ల అతలాకుతలమయ్యాయి. ప్రజల ఇళ్లు, వ్యవసాయ భూములు, మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయని నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ప్రతినిధి తెలిపారు. గల్లంతైన వారిని రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వరద ముప్పు ఉన్న ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు హెచ్చరించారు.
Afghanistan Flash Floods | వాతావరణ మార్పుల ప్రభావం..
అఫ్గానిస్తాన్‌లో భారీ వర్షాలు, మంచు కరగడం వల్ల తరచుగా ఆకస్మిక వరదలు ముంచెత్తుతుంటాయి. దశాబ్దాల పాటు సాగిన సంఘర్షణలు, బలహీనమైన మౌలిక సదుపాయాలు, అటవీ నిర్మూలన, వాతావరణ మార్పుల కారణంగా ఇటువంటి విపత్తుల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటోందని తెలిపారు. మట్టితో నిర్మించిన ఇళ్లు ఉండటం వల్ల వరదలు వచ్చినప్పుడు ప్రాణ నష్టం భారీగా జరుగుతోంది.
Afghanistan Flash Floods | ప్రభుత్వం దిగ్భ్రాంతి..
ఈ ఘటనపై ప్రభుత్వ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేశంలోని 34 ప్రావిన్సుల్లోని 10 ప్రాంతాలలో రానున్న రోజుల్లో భారీ వర్షాలు, బలమైన ఈదురు గాలులు, ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నదీ తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఇది కూడా చదవండి: Sriramsagar Project | శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు స్వల్ప ఇన్‌ఫ్లో.. రైతుల్లో చిగురిస్తున్న ఆశలు