అక్షరటుడే, వెబ్డెస్క్: Akulakondur Shivaji Statueనిజామాబాద్ జిల్లా ఆకులకొండూరు గ్రామంలో ప్రభుత్వ స్థలంలో ఎటువంటి అధికారిక అనుమతులు లేకుండా శివాజీ Shivaji విగ్రహం ఏర్పాటు చేసేందుకు భూమిపూజ నిర్వహించిన ఘటన వివాదానికి దారితీసింది.
గ్రామ పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు మేరకు నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో మాజీ సర్పంచితో పాటు పలువురిపై కేసు నమోదు చేశారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి పాపయ్యగారి పాపేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. ఆయన 2026 జూన్ 1 నుంచి ఆకులకొండూరు గ్రామ పంచాయతీలో విధులు నిర్వహిస్తున్నారు.
Akulakondur Shivaji Statue | మహిళా భవనం కోసం..
గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో 2026 జనవరి 9న నిర్వహించిన సమావేశంలో గ్రామ పంచాయతీ కార్యాలయం పక్కన ఉన్న సుమారు 200 చదరపు గజాల ప్రభుత్వ స్థలంలో మహిళా సంఘ భవనం నిర్మించాలని తీర్మానం చేసినట్లు తెలిపారు.
అయితే ఆదివారం (2026 ఆగస్టు 2న) ఉదయం సుమారు 8:30 గంటల సమయంలో మాజీ సర్పంచి అశోక్ తన అనుచరులు చంద్రకాంత్, ఆసాది శివ, పీర్రాజు, దాచారం మోహన్, రఘుపతి లక్ష్మణ్, రవికాంత్, మెట్టు ఆదిత్య, ఆసాది ప్రమోద్, సొంతం రవి, నితిన్ చైన్‌లతో కలిసి గ్రామ పంచాయతీ తీర్మానం, సంబంధిత అధికారుల అనుమతులు లేకుండానే అదే ప్రభుత్వ స్థలంలో శివాజీ విగ్రహం ఏర్పాటు కోసం భూమిపూజ నిర్వహించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
Akulakondur Shivaji Statue | పోలీసుల హెచ్చరిక..
ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ సందర్భంగా ప్రజలకు పోలీసులు సూచనలు జారీ చేశారు. ప్రభుత్వ స్థలాల్లో విగ్రహాల ఏర్పాటు, నిర్మాణాలు, ఇతర కార్యక్రమాలను చేపట్టే ముందు సంబంధిత శాఖల నుంచి తప్పనిసరిగా అనుమతులు పొందాలని, నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.