అక్షరటుడే, వెబ్‌డెస్క్: Akvan Cyclone | ఇప్పటికే అర్నబ్, మురసు తుఫాన్ల ప్రభావం నుంచి కోలుకోకముందే ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)కు మరో తీవ్ర తుఫాన్ ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ, దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం నేటి సాయంత్రానికి తుఫాన్‌గా మారనుందని వాతావరణ శాఖ వెల్లడించింది.
తుఫాన్‌గా బలపడిన తర్వాత దీనికి ‘అక్వాన్’ (Akvan) అని నామకరణం చేయనున్నారు. ఇది తదుపరి 48 గంటల్లో అతి తీవ్ర తుఫాన్‌గా మారి కోస్తాంధ్ర తీరాన్ని తాకే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో ఈనెల 18 నుంచి 20వ తేదీ వరకు కోస్తాంధ్రతో పాటు రాయలసీమ, తెలంగాణలోనూ భారీ వర్షాలు కురవనున్నాయి. ముఖ్యంగా 19, 20 తేదీల్లో తీర ప్రాంతాల్లో గంటకు 145 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీస్తాయని హెచ్చరికలు జారీ అయ్యాయి.
Akvan Cyclone | పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు..
గడిచిన 6 గంటలుగా గంటకు 8 కి.మీ వేగంతో కదులుతున్న ఈ వాయుగుండం, ప్రస్తుతం చెన్నైకి 720 కి.మీ, విశాఖపట్నానికి 820 కి.మీ, గోపాల్‌పూర్‌కు 940 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ నేపథ్యంలో నేడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అన్ని ప్రధాన పోర్టుల్లో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరికను ఎగురవేశారు. సముద్రం అల్లకల్లోలంగా మారనున్నందున ఈనెల 20వ తేదీ వరకు మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లవద్దని, ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.
Akvan Cyclone | ‘అక్వాన్’ పేరుకు అర్థం ఏమిటి?
బంగాళాఖాతంలో ఏర్పడుతున్న ఈ తుఫాన్‌కు ‘అక్వాన్’ అనే పేరును ఇరాన్ దేశం సూచించింది. పర్షియన్ భాషలో ‘అక్వాన్’ అంటే ‘రాక్షస శక్తి’ లేదా ‘దుష్ట మనస్సు’ (Evil Mind) అని అర్థం. ప్రపంచ వాతావరణ సంస్థ (WMO), ఐక్యరాజ్యసమితి ఆసియా-పసిఫిక్ కమిషన్ (UNESCAP) నిబంధనల ప్రకారం ఉత్తర హిందూ మహాసముద్రంలో ఏర్పడే తుఫాన్లకు నామకరణం చేస్తారు. భారత్, బంగ్లాదేశ్, ఇరాన్, శ్రీలంక సహా మొత్తం 13 సభ్య దేశాలు ఒక్కొక్కటి 13 పేర్ల చొప్పున అందించగా, 2020లో ఆమోదించిన 169 పేర్ల జాబితా నుంచి వరుసక్రమంలో ఈ పేర్లను కేటాయిస్తున్నారు. ఒకసారి వాడిన పేరును మళ్లీ వినియోగించరు.
ఇది కూడా చదవండి..: Bay of Bengal Cyclone | బంగాళాఖాతంలో బలపడుతున్న వాయుగుండం.. ఏపీకి మరో తుపాను ముప్పు!