అక్షరటుడే, వెబ్డెస్క్ : Anganwadi Breakfast | అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పాలు, బ్రేక్ఫాస్ట్ పథకం అమలు చేయాలని మంత్రి సీతక్క (Minister Seethakka) ఆదేశించారు. గురువారం ఆమె అధికారులతో సమీక్ష నిర్వహించారు.
అంగన్వాడీ కేంద్రాల్లో ఏడాది కాలంలోనే అదనంగా 5,938 కేంద్రాలకు టాయిలెట్ సదుపాయం, 3,815 కేంద్రాలకు తాగునీటి సదుపాయం, 14,271 కేంద్రాలకు విద్యుత్ సదుపాయం కల్పించినందుకు అధికారులు, సిబ్బందిని మంత్రి అభినందించారు. అంగన్వాడీ కేంద్రాల మౌలిక వసతులు, సిబ్బంది నియామకాలు, చిన్నారుల పోషకాహారం, పాఠశాల పూర్వ విద్య, దత్తత కేంద్రాలు, బాల్య వివాహాల నివారణ తదితర అంశాలపై మంత్రి సమగ్రంగా సమీక్షించారు. అంగన్వాడీ కేంద్రాల్లో మిగిలిపోయిన మౌలిక వసతుల పనులను ఏమాత్రం జాప్యం చేయకుండా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
Anganwadi Breakfast | సర్వే నిర్వహించాలి
అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అందుతున్న పోషకాహారం, వారి ఎదుగుదలపై శాంపిల్ సర్వే నిర్వహించాలని మంత్రి సీతక్క ఆదేశించారు. సర్వే ఫలితాల ఆధారంగా పోషకాహార కార్యక్రమాలను మరింత మెరుగుపరచాలని సూచించారు. అంగన్వాడీ చిన్నారులకు పాలు, బ్రేక్ఫాస్ట్ అందించే కార్యక్రమాలను ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అన్ని జిల్లాల్లో అమలు చేయాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం అమలవుతున్న కార్యక్రమాలను దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ప్రతి చిన్నారికి పోషకాహారం అందేలా చూడాలని ఆదేశించారు. చిన్నారుల ఉదయం ఆకలిని తీర్చడంతో పాటు వారి శారీరక, మానసిక ఎదుగుదలకు దోహదపడేలా బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.
Anganwadi Breakfast | పోస్టులు భర్తీ చేయాలి
అంగన్వాడీ టీచర్లు, ఆయాల ఖాళీల భర్తీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి స్పష్టం చేశారు. 16 జిల్లాల్లో నియామకాలకు నోటిఫికేషన్లు జారీ అయినట్లు అధికారులు వివరించారు. టీచర్లు, ఆయాల యూనిఫాంలను అక్టోబర్ తొలి వారంలోగా సిద్ధం చేయాలన్నారు. బస్టాండ్లు వంటి రద్దీ ప్రాంతాల్లో తల్లులు తమ పిల్లలకు పాలిచ్చేందుకు వీలుగా ఇప్పటికే 54 తల్లి ఒడి కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు మంత్రికి వివరించారు.
ఇది కూడా చదవండి : Ash Gourd Vastu | ఇంటికి దిష్టి తగలకుండా గుమ్మడికాయ కడుతున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!