అక్షరటుడే వెబ్డెస్క్: AP White Paper | రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu )శ్వేతపత్రం విడుదల చేశారు. గత ప్రభుత్వ హయాంలోని పరిస్థితులు, ప్రస్తుత తాజా పరిస్థితులను ఈ సందర్భంగా ఆయన ప్రజలకు వివరించారు. రాష్ట్ర సమగ్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. పాలన మెరుగ్గా ఉంటేనే దాని ఫలితాలు ప్రజల జీవితాల్లో స్పష్టంగా కనిపిస్తాయన్నారు.
AP White Paper | వైసీపీ హయాంలో విధ్వంసకర పాలన..
2019 నుంచి 2024 మధ్య కాలంలో రాష్ట్రంలో విధ్వంసకర పాలన సాగిందని, దీనివల్ల ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. గత పాలకుల వైఫల్యాలపై వ్యతిరేకతతోనే 2024 ఎన్నికల్లో కూటమికి ప్రజలు భారీ విజయం కట్టబెట్టారని తెలిపారు. ప్రజల నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబెట్టుకునేలా కూటమి ప్రభుత్వం ముందుకువెళ్తోందని చెప్పారు. ఈ శ్వేతపత్రం విడుదల వెనుక ఎవరినీ వ్యక్తిగతంగా నిందించాలనే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.
AP White Paper | ఏపీని గేట్వేగా మారుస్తున్నాం..
కూటమి ప్రభుత్వం పనితీరుకు భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవమే నిదర్శనమని చంద్రబాబు పేర్కొన్నారు. అది కేవలం ఒక ప్రాజెక్ట్ మాత్రమే కాదని, ఉత్తరాంధ్ర ప్రజల కలల సౌధమని అభివర్ణించారు. గత పాలకులు రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టులు రాకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం ఏపీని భవిష్యత్ అనుసంధానానికి అంతర్జాతీయ గేట్వేగా మారుస్తున్నామని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తాను చేసిన అభివృద్ధిని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
AP White Paper | భారీగా పడిపోయిన వృద్ధి రేటు..
2019లో తాము అధికారికంగా దిగిపోయే నాటికి రాష్ట్ర వృద్ధి రేటు (గ్రోత్ రేట్) 13.5 శాతంగా ఉండేదని సీఎం తెలిపారు. కానీ, 2019-24 మధ్య కాలంలో జీఎస్డీపీ (GSDP) ఏకంగా 3.18 శాతం తగ్గిపోయిందని వెల్లడించారు. గత ఐదేళ్ల కాలంలోనూ వృద్ధి రేటు అదే 13.5 శాతాన్ని కొనసాగించి ఉంటే, రాష్ట్రానికి అదనంగా రూ.76 వేల కోట్ల ఆదాయం సమకూరేదని గణాంకాలతో సహా వివరించారు.
ఇది కూడా చదవండి: DY Patil | త్రిపుర మాజీ గవర్నర్ డి.వై. పాటిల్ కన్నుమూత