Kamareddy Heavy Rain | అర్ధరాత్రి వర్షబీభత్సం.. కొట్టుకుపోయిన రోడ్లు.. ఇళ్లలోకి చేరిన నీరు

కామారెడ్డిలో అర్ధరాత్రి కురిసిన భారీ వర్షం పట్టణాన్ని ఆగం చేసింది.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Heavy Rain | కామారెడ్డిలో అర్ధరాత్రి కురిసిన భారీ వర్షం పట్టణాన్ని ఆగం చేసింది. కామారెడ్డి (Kamareddy) పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాలలో రాత్రి సుమారు 3 గంటల పాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి పలు గ్రామాల్లో అంధకారం నెలకొంది.

Kamareddy Heavy Rain | రహదారుపై నీళ్లు నిలిచి..

రహదారులలో నీళ్లు నిలిచి రాకపోకలు స్తంభించాయి. కామారెడ్డి పట్టణంలోని రామారెడ్డి రోడ్డులో డ్రైనేజీ నీరు రోడ్డుపై నిలిచిపోవడంతో పెళ్లి బస్సు సైలెన్సర్ లో నీళ్లు చేరి బస్సు నిలిచిపోయింది. దాంతో బస్సులో ఉన్న ప్రజలు ఆందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఫైర్ సిబ్బంది రోప్ సహాయంతో 45 మందిని బస్సులో నుంచి సురక్షితంగా బయటకు తీసుకువచ్చి ఇతర బస్సులో గమ్యస్థానానికి చేర్చారు. నిజాంసాగర్ రోడ్డులో విద్యానగర్, కాకతీయ నగర్, దేవునిపల్లి గ్రామాల నుంచి వచ్చే నీటితో రహదారిపై నీళ్లు నిలిచిపోయాయి. విశాల్​ షాపింగ్ మాల్ సెల్లార్​లో నీళ్లు చేరాయి.

Kamareddy Heavy Rain |  టీచర్స్​ కాలనీలో..

టీచర్స్ కాలనీ వర్షం నీటిలో చిక్కుకుంది. ఇళ్లలోకి నీళ్లు చేరి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లు ధ్వంసమయ్యాయి. పంచముఖి హనుమాన్ ఆలయం ముందు గల కల్వర్టు నిండిపోయి పంచముఖి హనుమాన్ కాలనీ మొత్తం నీటితో నిండిపోయింది. మోకాలి లోతు నీళ్లలో ప్రజలు బయటకు వెళ్లడానికి ఇబ్బందులు పడ్డారు. స్థానిక కౌన్సిలర్ జేసీబీతో డ్రైనేజీలో నిండిపోయిన మట్టి, చెత్తను తొలగించారు. వర్షపు నీటికి కొట్టుకు వచ్చిన ఇసుకను ట్రాక్టర్​లో తరలించారు. భారీ వర్షానికి రైల్వే కమాన్ కింద, పోలీస్ స్టేషన్ ముందు నీళ్లు నిలిచిపోయి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గతేడాది వరదల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న జీఆర్ కాలనీ, కౌండిన్య కాలనీ, హౌజింగ్ బోర్డు కాలనీ ప్రజలు భారీ వర్షంతో మళ్లీ ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయోనని ఆందోళనకు గురయ్యారు.

Kamareddy Heavy Rain | ఉప్పొంగిన పెద్దచెరువు..

పెద్దచెరువు నిండిపోయి ఉప్పొంగడంతో వరద కాలువ నిండుగా పారుతోంది. జీఆర్ కాలనీ పక్క నుంచే ఈ కాలువ వెళ్తుండటంతో ప్రజలు భయంభయంగా గడుపుతున్నారు. తాడ్వాయి మండలం కాళోజీవాడి గ్రామంలో వర్షంనీరు చేరడంతో రహదారిని బ్లాక్ చేశాయి. గ్రామం నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. కామారెడ్డి పెద్ద చెరువు నిండిపోవడంతో ఉప్పొంగి ప్రవహిస్తోంది. దాంతో ప్రజలు పెద్దఎత్తున చెరువును తిలకించడానికి పోటెత్తుతున్నారు. వరద తీవ్రత దృశ్యా పెద్దచెరువును ఎస్పీ రాజేష్ చంద్ర పరిశీలించారు. ప్రజలను చెరువు నీటి వద్దకు అనుమతించవద్దని పోలీసులకు సూచించారు. సెల్ఫీల కోసం ఎగబడి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని ప్రజలను ఎస్పీ కోరారు.

ఇది కూడా చదవండి..: Nizamsagar Reservoir | జలకళను సంతరించుకున్న నిజాంసాగర్​ జలాశయం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *