అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Assembly Sessions | అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దాడి, స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలపై మంగళవారం చర్చ జరిగింది.
మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) మాట్లాడుతూ.. పోలీసులు సబితా ఇంద్రారెడ్డి గొంతు పిసికారని, సునీతా లక్ష్మారెడ్డి చీర లాగి అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయండి అని అడిగితే.. వాళ్లపైనే ఉల్టా కేసులు పెట్టారని మండిపడ్డారు. అసెంబ్లీ కౌరవ సభగా మారిందన్నారు. కలియుగ దుశ్శాసనుడిలా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆనాడు కౌరవులకు పట్టిన గతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పడుతుందన్నారు.
Assembly Sessions | విచారం వ్యక్తం చేస్తున్నాం
ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలపై హరీశ్‌రావు స్పందించారు. ఆయన స్పీకర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయలేదని ఇప్పటికే చెప్పారన్నారు. ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడంతో పాటు విచారం వ్యక్తం చేశారని గుర్తు చేశారు. ఒకవేళ మిమ్మల్ని అన్నట్లు మీరు భావించి ఉంటే తాము కూడా విచారం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. ఇప్పుడు దీని మీద అంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి దళితుల మీద ప్రేమ ఉంటే ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ఎందుకు అమలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు.
Assembly Sessions | విచారణ జరిపిస్తాం
సబిత, సునీత, కోవా లక్ష్మి అంటే తనకు గౌరవం ఉందని స్పీకర్ ప్రసాద్ కుమార్ అన్నారు. వాళ్లు తనకు తోబుట్టువులతో సమానమని చెప్పారు. సబితమ్మకు జరిగిన దానిపై తానే విచారణ జరిపించాలని చెప్పానని తెలిపారు. తనను అవమానించిన అంశంపై మాట్లాడాలని హరీశ్‌రావుకు సూచించారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. నిన్నటి ఘటనలపై నివేదిక తీసుకుంటున్నామని చెప్పారు. సబిత, సునీత లక్ష్మారెడ్డిపై తమకు గౌరవం ఉందన్నారు.
ఇది కూడా చదవండి..: CPR Saves Life | సీపీఆర్ చేసి ఒకరి ప్రాణాలు కాపాడిన మంత్రి