అక్షరటుడే వెబ్‌డెస్క్: Bandi Sanjay SIR | ప్రధాని నరేంద్ర మోదీ ( Narendra Modi ) ప్రభుత్వాన్ని ఎదుర్కొనే దమ్ములేక, ఎన్నికల్లో గెలిచే సత్తా లేకనే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘం (EC), ఈవీఎంలు, ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియపై నిరాధార ఆరోపణలు చేస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటనలో కాంగ్రెస్ తీరును తప్పుబట్టారు. దేశ ప్రజలు వరుసగా మూడుసార్లు అడ్డంకులు లేకుండా గెలిపించినందుకు, భారత్‌ను ఆర్థిక ప్రగతిలో అగ్రస్థానంలో నిలిపినందుకు ప్రధాని మోదీ ఎందుకు రాజీనామా చేయాలని ఆయన నిలదీశారు. మోదీ ప్రభుత్వాన్ని బ్రిటీష్ పాలనతో పోల్చడం అత్యంత హేయనీయమని, ఇది భారత ప్రజాస్వామ్య వ్యవస్థను, భారతీయుల సామర్థ్యాన్ని కించపరచడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Bandi Sanjay SIR | ఈవీఎంలు బాగానే ఉన్నాయా?
తెలంగాణ , కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు, ఆ పార్టీ అభ్యర్థులు గెలిచినప్పుడు ఈవీఎంలు, ఎన్నికల సంఘం పనితీరు బాగానే ఉన్నాయా అని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. కేరళలో ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియ వల్ల బోగస్ ఓట్లు, చనిపోయిన వారి ఓట్లు తొలగిపోయి తమకు మేలు జరిగిందని స్వయంగా ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేత రమేశ్ చెన్నితల అంగీకరించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.
Bandi Sanjay SIR | దుష్ప్రచారం దుర్మార్గం..
ఎస్‌ఐఆర్ అనేది కొత్తగా తెచ్చిన విధానం కాదని, గతంలోనూ దీన్ని అమలు చేశారని, సుప్రీంకోర్టు కూడా దీన్ని సమర్థించిందని బండి సంజయ్ స్పష్టం చేశారు. అర్హులైన ఏ ఒక్క పౌరుడి ఓటు హక్కు పోకూడదనే ఉద్దేశంతోనే ఈ ప్రక్షాళన జరుగుతోందని తెలిపారు. డూప్లికేట్, విదేశీ అక్రమ వలసదారులు, మరణించిన వారి అనర్హత ఓట్లు జాబితాలో ఉండకూడదన్నదే దీని ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ ప్రక్రియను పకడ్బందీగా అమలు చేసేది రాష్ట్ర ప్రభుత్వ అధికారులే అన్న విషయం మరచిపోయి, దాన్ని కేంద్రంపై నెట్టడం కాంగ్రెస్ దివాళాకోరు తనానికి నిదర్శనమని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఓటు ఎంత పవిత్రమైనదో, ఓటరు జాబితా కూడా అంతే పవిత్రంగా ఉండాలని బండి సంజయ్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Robotic Joint Replacement | రోబోటిక్ సర్జరీతో విజయవంతంగా జాయింట్ రీప్లేస్మెంట్..