అక్షరటుడే, వెబ్డెస్క్: By-Election Results 2026 | దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఇటీవల అక్టోబర్ 6న జరిగిన అసెంబ్లీ, లోక్సభ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం నుంచి ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి, అస్సాం రాష్ట్రాల్లోని మొత్తం ఆరు స్థానాల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా తమిళనాడులో ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay) నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ అద్భుతమైన దూకుడు ప్రదర్శిస్తూ తిరుగులేని ఆధిక్యతతో విజయాల బాట పట్టింది.
By-Election Results 2026 | తమిళనాడులో టీవీకే జోరు ..
మధురాంతకం నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థి కే. మరగతం కుమారవేల్ తన సమీప ప్రత్యర్థి, డీఎంకే అభ్యర్థి ఐ. పరంధామెన్పై స్పష్టమైన ఆధిక్యంతో విజయాల దిశగా దూసుకెళ్తుండగా, ధరాపురం స్థానంలోనూ టీవీకే అభ్యర్థి సత్యబామ తన ప్రత్యర్థి, డీఎంకే అభ్యర్థి సుగన్య ఎస్పై భారీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ విజయానికి చేరువయ్యారు.
By-Election Results 2026 | ఇతర రాష్ట్రాల ఫలితాలు..
పుదుచ్చేరిలో తట్టన్చావడి అసెంబ్లీ ఉప ఎన్నికలో ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ (AINRC) అభ్యర్థి అశోక్ ఆనంద్ ఘనవిజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థిపై 8,482 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. పుదుచ్చేరి ముఖ్యమంత్రి, ఏఐఎన్ఆర్సీ అధినేత ఎన్. రంగస్వామి గతంలో రెండు స్థానాల్లో గెలిచి ఒక స్థానాన్ని వదులుకోవడంతో ఇక్కడ ఉప ఎన్నిక వచ్చింది. ఇక అస్సాంలోని నాగావ్ లోక్సభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి దేవశిష్ శర్మ భారీ ఓట్ల ఆధిక్యంతో ముందంజలో ఉంటూ గట్టి పట్టు నిలుపుకోగా, పశ్చిమ బెంగాల్లోని నందిగ్రామ్, రెజీనగర్ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు తమ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ దూసుకెళ్తున్నారు. మొత్తంగా వివిధ రాష్ట్రాల్లో వెలువడుతున్న ఈ ఉప ఎన్నికల ఫలితాలు ఆయా రాజకీయ పార్టీల బలబలాలకు అద్దం పడుతున్నాయి.
ఇది కూడా చదవండి..: Chief Election Commissioner Resignation | కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీనామా చేయాలి