Chilakaluripet Bus Accident | ఆటోను ఢీకొన్న ట్రావెల్స్​ బస్సు.. ఏడుగురి మృతి

పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద ఆటోను ట్రావెల్స్​ బస్సు ఢీకొంది. ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Chilakaluripet Bus Accident | ఆంధ్రప్రదేశ్​లోని పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంగా వచ్చిన ప్రైవేట్​ ట్రావెల్స్​ బస్సు ఆటోను ఢీకొంది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు.

పల్నాడు జిల్లా (Palnadu District) చిలకలూరిపేట వద్ద విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ఇంటర్‌సిటీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీకొంది. ప్రమాద సమయంలో ఆటోలో 16 మంది ప్రయాణికులు ఉన్నారు. ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు, పోలీసులు చికిత్స కోసం స్థానిక ఆస్పత్రులకు తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతులు చిలకలూరిపేట మండలం వేలూరుకు చెందిన బొంతా మంగమ్మ, బాబురావు, గంగమ్మ, సంపూర్ణమ్మ, మరియమ్మ, సువార్త, లక్ష్మమ్మగా గుర్తించారు.

Chilakaluripet Bus Accident | బర్త్​ డే పార్టీకి వెళ్లి వస్తుండగా..

బాధితులు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని తిరుగు ప్రయాణంలో వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఆటో రోడ్డు దాటుతుండగా.. తెల్లవారుజామున వేగంగా వచ్చిన బస్సు ఢీకొంది. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు పేర్కొన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. కాగా సూర్యాపేట జిల్లాలో బుధవారం ట్రావెల్స్​ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులు చనిపోయారు. ప్రైవేట్​ ట్రావెల్స్​ బస్సు ప్రమాదాలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Chilakaluripet Bus Accident | వైఎస్​ జగన్​ దిగ్భ్రాంతి

చిలకలూరిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారందరికీ తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని, అవసరమైన అన్ని చికిత్సా సదుపాయాలు కల్పించాలని కోరారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రోడ్డు భద్రతా చర్యలను మరింత పటిష్టం చేయాలని కోరారు.

ఇది కూడా చదవండి..: Nagarjuna Sagar | నాగార్జున సాగర్​ నీటి విడుదల.. ఏపీ, తెలంగాణ మధ్య వివాదం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *