అక్షరటుడే, కామారెడ్డి: Contract Teacher Death | కాంట్రాక్టు టీచర్ మృతి అనుమానాలు రేకెత్తిస్తోంది. కామారెడ్డి (Kamareddy) పట్టణంలో ఉపాధ్యాయుడి మృతిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Contract Teacher Death | హైకోర్టు తీర్పుతో..
కామారెడ్డి పట్టణంలోని శ్రీరాంనగర్ కాలనీకి చెందిన వీసం రాజు (42) హైకోర్టు తీర్పుతో మనస్తాపం చెంది ఉరి వేసుకుని చనిపోయాడని ప్రచారం సాగుతోంది. డీఎస్సీ 2008లో మెరిట్లో సెలక్ట్ అయిన రాజు అప్పటి ప్రభుత్వం ఇచ్చిన జీవో.28 వల్ల ఉద్యోగం కోల్పోయి హైకోర్టును ఆశ్రయించాడు. ఈనెల 13న ప్రభుత్వం ఇచ్చిన జీవోను హైకోర్టు సమర్థించడంతో మెరిట్ సాధించిన తమకు ఉద్యోగాలు రాకుండా తమకంటే తక్కువ మార్కులు వచ్చిన వారికి ఉద్యోగాలు వచ్చాయని, హైకోర్టు తమకు అన్యాయం చేసిందని తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం సాగింది. మృతునికి భార్య అర్చన, ఇద్దరు పిల్లలు తేజస్వర్(7), నిఖిత(3) ఉన్నారు. అయితే పోలీసులకు భార్య అర్చన ఇచ్చిన ఫిర్యాదు మాత్రం ప్రచారానికి భిన్నంగా ఉంది. తన భర్త గత కొంతకాలంగా అజీర్ణం, నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నాడని, పలు ఆస్పత్రుల్లో వైద్యం చేయించినా నయం కాలేదని ఫిర్యాదులో మృతుని భార్య పేర్కొంది. ఈనెల 25న మధ్యాహ్నం 1:30 గంటలకు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడని, అనారోగ్యంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడని, ఎవరిపైనా అనుమానం లేదని ఫిర్యాదులో పేర్కొంది. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: కండక్టర్ ప్రాణం మీదికి తెచ్చిన ‘చిల్లర’ గొడవ!