Cyber Crime Awareness | సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి : సీపీ సాయి చైతన్య

Naresh Chandan

అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Cyber Crime Awareness | సైబర్ నేరాలు రోజురోజుకూ కొత్త రూపాల్లో జరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని నిజామాబాద్ Nizamabad పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య సూచించారు. నిజామాబాద్ జిల్లాలోని కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ ఉమెన్ కళాశాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పోలీస్ కమిషనర్ విద్యార్థినులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. సాంకేతిక పరిజ్ఞానం విస్తరిస్తున్న కొద్దీ సైబర్ నేరాలు కూడా కొత్త పద్ధతుల్లో జరుగుతున్నాయని తెలిపారు. ప్రజల అత్యాశ, భయం, అత్యవసర పరిస్థితులు, ఉద్యోగాల అవసరం వంటి అంశాలను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని వివరించారు.

Cyber Crime Awareness | వివిధ రకాల సైబర్ మోసాలపై అవగాహన

ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్, డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్, సోషల్ మీడియా ఫేక్ ప్రొఫైల్ ఫ్రాడ్, డీప్‌ఫేక్ ఫ్రాడ్, పార్ట్‌టైమ్ జాబ్ ఫ్రాడ్, లోన్ ఫ్రాడ్, ఆన్‌లైన్ షాపింగ్ ఫ్రాడ్ తదితర మోసాల తీరును విద్యార్థినులకు వివరించారు.

అధిక లాభాలు వస్తాయని నమ్మించి నకిలీ యాప్‌లు, వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా పెట్టుబడులు పెట్టించి భారీగా డబ్బులు దోచుకుంటున్నారని తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తులు పంపించే పెట్టుబడి లింకులు, యాప్‌లను నమ్మవద్దని సూచించారు.

డిజిటల్ అరెస్ట్ మోసాల్లో పోలీస్, సీబీఐ, ఈడీ, కస్టమ్స్ తదితర ప్రభుత్వ సంస్థల అధికారులుగా నకిలీ వీడియో కాల్స్ చేసి, కేసుల్లో ఇరుక్కున్నారని భయపెట్టి డబ్బులు బదిలీ చేయించుకుంటారని చెప్పారు. ఏ ప్రభుత్వ సంస్థ కూడా వీడియో కాల్ ద్వారా ‘డిజిటల్ అరెస్ట్’ చేసి డబ్బులు చెల్లించాలని ఆదేశించదని స్పష్టం చేశారు.

సోషల్ మీడియా ఫేక్ ప్రొఫైల్స్, డీప్‌ఫేక్ మోసాల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వ్యక్తుల ఫొటోలు, వీడియోలు, పేర్లను దుర్వినియోగం చేసి నకిలీ ఖాతాలు సృష్టించడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను ఉపయోగించి మార్ఫింగ్, డీప్‌ఫేక్ వీడియోలు రూపొందించడం ద్వారా మోసాలకు పాల్పడుతున్నారని వివరించారు.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

పార్ట్‌టైమ్ ఉద్యోగాలు, లోన్లు, ఆన్‌లైన్ షాపింగ్ పేరుతో జరిగే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తులకు ఓటీపీలు, పిన్‌లు, సీవీవీలు, పాస్‌వర్డ్‌లు, బ్యాంకు ఖాతా వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించవద్దని సూచించారు.

Cyber Crime Awareness | డబ్బులు పోతే వెంటనే 1930కు ఫిర్యాదు

సైబర్ మోసంలో డబ్బులు కోల్పోయినట్లయితే బాధితులు భయపడకుండా వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాలని సీపీ సూచించారు. మోసం జరిగిన వెంటనే స్పందించడం అత్యంత కీలకమని, ప్రారంభ దశలో ఫిర్యాదు చేస్తే మోసపోయిన నగదును నిలిపివేసే అవకాశం ఉంటుందని తెలిపారు.

అదేవిధంగా cybercrime.gov.in వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేయాలని, సైబర్ మోసం జరిగిన వెంటనే బ్యాంకు లేదా సంబంధిత ఆర్థిక సంస్థలకు కూడా సమాచారం అందించాలని సూచించారు. విద్యార్థినులు తాము సైబర్ నేరాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితులు, పరిచయస్తులకు కూడా సైబర్ మోసాలపై అవగాహన కల్పించాలని కోరారు.

Cyber Crime Awareness | వాల్ పోస్టర్ల విడుదల

ఈ కార్యక్రమంలో భాగంగా సైబర్ క్రైమ్‌కు సంబంధించిన వాల్ పోస్టర్లను విడుదల చేశారు. సురక్షితమైన డిజిటల్ వినియోగం, వ్యక్తిగత సమాచార రక్షణ, ఆన్‌లైన్ లావాదేవీల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు.

కార్యక్రమంలో నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్ యాదవ్, కాకతీయ ఇన్‌స్టిట్యూట్స్ చైర్మన్ రజనీకాంత్, నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్, సైబర్ క్రైమ్ సీఐ శ్రీముఖి పాష, మాక్లూర్ ఎస్సై అనిల్ రెడ్డితో పాటు విద్యార్థినులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *