అక్షరటుడే వెబ్‌డెస్క్: Cyclone Aquan | బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రమైన ‘అక్వాన్’ తుఫాను ఉత్తర ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ), యానాం, దక్షిణ ఒడిశా తీరాల వైపు దూసుకొస్తోంది. నవంబర్ 20 మధ్యాహ్నానికి ఇది నర్సాపూర్–పూరీ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. తుఫాను ప్రభావంతో తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
Cyclone Aquan | గంటకు 110 కి.మీ వేగంతో ..
ప్రస్తుతం ఉత్తర వాయువ్య దిశగా కదులుతున్న ఈ తుఫాను.. నవంబర్ 18 ఉదయం 11:30 గంటల సమయానికి దక్షిణ బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. ఇది నర్సాపూర్‌కు 540 కి.మీ, చెన్నైకి 570 కి.మీ, కాళింగపట్నానికి 600 కి.మీ, గోపాల్‌పూర్‌కు 690 కి.మీ, పూరీకి 750 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నవంబర్ 18 సాయంత్రం నాటికి దీని తీవ్రత మరింత పెరిగి, గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో (గరిష్ఠంగా 120 కి.మీ) గాలులు వీచే అవకాశం ఉంది.
Cyclone Aquan | నవంబర్ 19 తర్వాత బలహీనపడే అవకాశం..
అయితే, నవంబర్ 19 తర్వాత తుఫాను క్రమంగా బలహీనపడే సూచనలు కనిపిస్తున్నాయి. తీర ప్రాంతానికి దగ్గరవుతున్న కొద్దీ చల్లని, పొడి గాలుల ప్రభావం, అధిక విండ్ షీర్ కారణంగా ఇది ముందుగానే కొంత బలహీనపడవచ్చని IMD వివరించింది. నవంబర్ 20న తీరం దాటే సమయానికి గాలుల వేగం గంటకు 60 నుంచి 70 కిలోమీటర్లకు తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు. అయినప్పటికీ, తుఫాను గమనం , ల్యాండ్‌ఫాల్ జరిగే కచ్చితమైన ప్రాంతంపై ఇంకా కొంత అనిశ్చితి కొనసాగుతోంది.
Cyclone Aquan | వాతావరణ శాఖ హెచ్చరిక..
తుఫాను ముప్పు నేపథ్యంలో బంగాళాఖాతంలో వేటకు వెళ్లవద్దని మత్స్యకారులను IMD అప్రమత్తం చేసింది. ఆంధ్రప్రదేశ్, యానాం, ఒడిశా తీర ప్రాంత ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఎప్పటికప్పుడు అధికారిక వాతావరణ బులెటిన్లను గమనించాలని, స్థానిక యంత్రాంగం జారీ చేసే సూచనలను విధిగా పాటించాలని అధికారులు కోరారు.
ఇది కూడా చదవండి: Pension Criticism | పింఛన్ల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేస్తోంది: మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి