అక్షరటుడే వెబ్‌డెస్క్: Danam Nagender | రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌ను బుధవారం విచారిస్తామని సుప్రీంకోర్టు ( Supreme Court )ప్రధాన న్యాయమూర్తి (CJI) ధర్మాసనం వెల్లడించింది. పార్టీ ఫిరాయింపుల కేసులో తనపై అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
Danam Nagender | కోర్టు దృష్టికి ..
ఈ పిటిషన్‌ను సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి సుప్రీంకోర్టులో ప్రత్యేకంగా ప్రస్తావించారు. స్పీకర్ తిరస్కరించిన పిటిషన్‌ను పరిగణలోకి తీసుకుని హైకోర్టు దానం నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటించిందని, ఈ కేసులో అత్యవసరంగా విచారణ జరపకపోతే ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అందువల్ల వెంటనే విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
Danam Nagender | ప్రతివాదుల అభ్యంతరం..
అయితే, దానం నాగేందర్ తరఫు న్యాయవాది విజ్ఞప్తిని ప్రతివాదుల తరఫు లాయర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విషయంలో తమ వాదనలను కూడా వినాలని కోరారు. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తరఫు న్యాయవాదులు మాట్లాడుతూ తమ క్లయింట్లు ఇప్పటికే సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేశారని, కేసును మరో రోజు విచారించాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న సీజేఐ ధర్మాసనం.. ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ జరుపుతామని స్పష్టం చేసింది.
Danam Nagender | ఉప ఎన్నికపై తీవ్ర ఉత్కంఠ..
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఖైరతాబాద్ నుంచి గెలిచిన దానం నాగేందర్.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున సికింద్రాబాద్ నుంచి పోటీ చేశారు. బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో నిలవడాన్ని తీవ్రంగా పరిగణించిన తెలంగాణ హైకోర్టు దీనిని పార్టీ ఫిరాయింపుగా తేల్చింది. సెప్టెంబర్ 18న ఇచ్చిన తీర్పులో 2024 ఏప్రిల్ 23 నాటి నుంచే దానం నాగేందర్ అనర్హుడని స్పష్టం చేస్తూ, ఖైరతాబాద్ స్థానం ఖాళీ అయినట్లు ప్రకటించింది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయడంతో ఖైరతాబాద్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ స్థానానికి ఉప ఎన్నిక వస్తుందా లేదా అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఇది కూడా చదవండి: IIT Bombay Student Suicide | ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య.. విద్యార్థులతో సంస్థ చర్చలు