అక్షరటుడే వెబ్‌డెస్క్: Delhi SIR Voter Notices | కేంద్ర ఎన్నికల సంఘం (ECI) చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఓటర్ల జాబితా సవరణలో భాగంగా దేశంలోని పలువురు కీలక ప్రముఖులకు ఈసీ నోటీసులు జారీ చేసింది. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ( S Jaishankar ), సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్, మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తదితరుల పేర్లు ఈ జాబితాలో ఉండటం రాజకీయ, అధికారిక వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
Delhi SIR Voter Notices | వీవీఐపీలకు ఈసీ నోటీసులు..
ఢిల్లీలోని ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ప్రముఖుల పేర్లు తప్పుల తడకగా మారడంతో ఎన్నికల సంఘం వారందరికీ అధికారికంగా నోటీసులు జారీ చేసింది. విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, ఆయన భార్య క్యోకో శంకర్, మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, ఆయన సతీమణి, అలాగే సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్, ఆయన కుటుంబ సభ్యులు ఈ జాబితాలో ఉన్నారు.
Delhi SIR Voter Notices | ఎవరికి నోటీసులు..
న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలోని సుందర్ బాగ్ పోలింగ్ కేంద్రంలో ఓటర్లుగా ఉన్న విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, ఆయన భార్య క్యోకో శంకర్ పేర్లను గత SIR జాబితాతో సరిగ్గా అనుసంధానించలేకపోవడంతో, వారిని ‘అన్ మ్యాప్డ్ విత్ లాస్ట్ SIR’ కేటగిరీ కింద చేర్చి నోటీసులు పంపారు. అలాగే సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్, ఆయన భార్య వనిత సూద్, తల్లి కమలేష్ సూద్‌లకు , మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, ఆయన భార్య సునీత ద్వివేదిలకు కూడా ఇదే కేటగిరీలో నోటీసులు అందాయి. ఇక వీరితో పాటు సీపీఎం ఎంపీ జాన్ బ్రిటాస్ భార్య షీనా బ్రిటాన్‌కు ‘సెల్ఫ్ నేమ్ మిస్ మ్యాచ్’ కింద, ఆయన కుమారుడు ఆనంద్ బ్రిటాస్‌కు ‘పేరెంట్ నేమ్ మిస్ మ్యాచ్’ కింద వేర్వేరు కారణాలతో ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది.
Delhi SIR Voter Notices | ‘అన్ మ్యాప్డ్’ కేటగిరీలో ..
SIR ప్రక్రియలో భాగంగా ప్రస్తుత ఓటర్ల వివరాలను గతంలో తీసిన ఓటర్ల జాబితాలతో అధికారులు సరిపోల్చి చూస్తారు. పాత రికార్డులతో ప్రస్తుత వివరాలను సరిగ్గా లింక్ చేయలేకపోతే వాటిని ‘అన్ మ్యాప్డ్’ కేటగిరీలో గుర్తిస్తారు. పేర్లు, పుట్టిన తేదీ లేదా ఇతర వివరాల్లో ఏ చిన్న తేడా ఉన్నా ఈ సమస్య వస్తుంది. అయితే, ఈ నోటీసులు అందడం అంటే ఓటర్ జాబితా నుంచి పేర్లు తొలగించినట్లు కాదని, కేవలం సరైన పత్రాలు సమర్పించి వివరాలను సరిచేసుకోవడానికి ఇదొక అవకాశం అని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Tirumala Brahmotsavam | స్వర్ణరథంపై విహరించిన శ్రీవారు