Digital Arrest Scam | వృద్ధుడిని టార్గెట్ చేసిన సైబర్ కేటుగాళ్లు.. రంగంలోకి దిగిన టీజీసీఎస్‌బీ

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న 'డిజిటల్ అరెస్ట్' మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Digital Arrest Scam | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ‘డిజిటల్ అరెస్ట్’ మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని నేరేడ్‌మెట్‌లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. ఎన్‌ఐఏ అధికారులమంటూ బెదిరించి 85 ఏళ్ల రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి నుంచి రూ. 85.20 లక్షలు కాజేశారు. అయితే, సకాలంలో స్పందించిన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) అధికారులు ఆ మొత్తం సొమ్మును రక్షించి బాధితుడికి ఊరటనిచ్చారు.

Digital Arrest Scam | అసలు ఏం జరిగిందంటే..

నేరేడ్‌మెట్‌కు చెందిన ఈ నెల 21వ తేదీన వృద్ధుడికి సైబర్ నేరగాళ్లు వీడియో కాల్ చేశారు. పోలీస్ యూనిఫాంలో ఉన్న వ్యక్తి ఎన్‌ఐఏ అధికారి అని పరిచయం చేసుకుంటూ తెలుగులో మాట్లాడడంతో వృద్ధుడు నిజమేనని నమ్మాడు. బాధితుడి ఆధార్ కార్డును ఉపయోగించి ‘అబ్దుల్ సలామ్’ అనే వ్యక్తి కేరళ, కర్ణాటకల్లో రూ. 2.50 కోట్ల మోసాలకు పాల్పడ్డాడని, ఆ బ్యాంకు ఖాతాలతో మీకూ సంబంధం ఉందని నేరగాళ్లు నమ్మబలికారు. ఆర్బీఐ వెరిఫికేషన్ పేరుతో రూ. 85.20 లక్షలను తాము చెప్పిన ఖాతాకు బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే స్థానిక పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారని తీవ్రంగా భయపెట్టారు.

Digital Arrest Scam | ఫిర్యాదు చేయడంతో..

కొద్ది రోజుల తర్వాత సైబర్ కేటుగాళ్లు మరో రూ. 42 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేయడంతో వృద్ధుడికి అనుమానం వచ్చింది. వెంటనే తన బ్యాంకు అధికారులను సంప్రదించగా తాను మోసపోయానని గ్రహించి, జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ (NCRP)లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే అప్రమత్తమైన TGCSB అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. కోయంబత్తూరులోని ఐడీఎఫ్‌సీ (IDFC) బ్యాంకులో ఉన్న నిందితుడి ఖాతాను గుర్తించి వెంటనే ఫ్రీజ్ చేశారు. దీంతో బాధితుడు పోగొట్టుకున్న రూ. 85.20 లక్షల పూర్తి మొత్తాన్ని అధికారులు సురక్షితంగా రక్షించగలిగారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న మల్కాజిగిరి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Model School Teachers | ప్రభుత్వ తీరుతో ఉపాధ్యాయుల ఇబ్బందులు : హరీశ్​రావు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *