Digital Self Enumeration | స్వీయ గణనను సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్​

Balla Sandeep Kumar

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Digital Self Enumeration | జన గణన ప్రక్రియలో భాగంగా కలెక్టర్​ ఇలా త్రిపాఠి ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో స్వీయ నమోదు చేసుకున్నారు. జన గణనలో స్వయంగా వివరాలు నమోదు చేసుకునేందుకు అందుబాటులోకి తెచ్చిన https://se.census.gov.in వెబ్​సైట్​ ద్వారా తన వివరాలను నమోదు చేసుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జన గణన ప్రక్రియను సులభంగా, సమగ్రంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం డిజిటల్ స్వీయ గణన (Digital Self-Enumeration) విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిందని తెలిపారు. ఆన్​లైన్​లో ప్రజలు తమ వ్యక్తిగత, కుటుంబ వివరాలను నమోదు చేసుకోవచ్చని వివరించారు. వెబ్ పోర్టల్ లేదా మొబైల్ యాప్ ద్వారా స్వయంగా నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించినట్లు పేర్కొన్నారు.

Digital Self Enumeration | ఈ నెల 26 నుంచి మే 10 వరకు..

స్వీయ నమోదు ఈ నెల 26 నుంచి మే 10వ తేదీ వరకు చేసుకోవచ్చని కలెక్టర్​ సూచించారు. తమ సమాచారాన్ని 15 నిమిషాల వ్యవధిలో పూర్తి చేసుకోవచ్చని చెప్పారు. వివరాలు నమోదు చేసిన అనంతరం ప్రత్యేక సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఐడీ (SEID) జారీ అవుతుందని వివరించారు. ప్రభుత్వం నియమించిన ఫీల్డ్ ఎన్యుమరేటర్లు మే 11 నుంచి జూన్ 9వ తేదీ మధ్యకాలంలో క్షేత్రస్థాయిలో ఇంటికి వచ్చిన సమయంలో వారికి సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఐడీ నెంబర్ తెలియజేయాలని సూచించారు. ప్రజలు తమ వివరాలను ప్రస్తుతం ఆన్​లైన్​ పోర్టల్ ద్వారా స్వీయ నమోదు చేసుకుంటే, ధ్రువీకరణ సమయంలో వారు ఇంట్లో భౌతికంగా ఉండాల్సిన అవసరం ఉండదని చెప్పారు.

ఆన్‌లైన్‌లో నమోదు చేసిన సమాచారాన్ని సెల్ఫ్ ఎన్యుమరేషన్ ఐడీ ద్వారా ఎన్యూమరేటర్ పరిశీలించి ధృవీకరిస్తారని కలెక్టర్​ తెలిపారు. దీనివల్ల ఉద్యోగరీత్యా ఇతర ప్రాంతాల్లో ఉండే వారు, విద్యార్థులు, వలస కార్మికులు, ప్రయాణాల్లో ఉన్న ప్రజలు కూడా జనగణనలో వివరాలు నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించారని చెప్పారు.

Digital Self Enumeration | సరైన వివరాలు నమోదు చేయాలి

స్వీయ గణనలో కచ్చితమైన చిరునామా, సరైన వివరాలు నమోదు చేయాలని కలెక్టర్​ సూచించారు. వీటి ఆధారంగానే ఎన్యూమరేటర్లను నియమించడం జరుగుతుందన్నారు. జనగణన ప్రక్రియలో సాంకేతికతను వినియోగించి సమగ్రతను పెంచడం, ప్రతి పౌరుడి వివరాలు జనగణనలో చేరేలా చూడడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ విధానం అందుబాటులోకి తెచ్చిందని వివరించారు. డిజిటల్ స్వీయ గణన ప్రక్రియను జిల్లాలోని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. ప్రతి ఒక్కరి వివరాలు గోప్యంగా ఉంటాయని చెప్పారు. సంక్షేమ పథకాలను సమర్ధవంతంగా అమలు చేస్తూ, సమగ్రాభివృద్ధి సాధించేందుకు దోహదపడే జన గణనలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని సూచించారు. జిల్లాలో ఈ ప్రక్రియ విజయవంతమయ్యేందుకు సహకరించాలని కోరారు.

collector 1

ఇది కూడా చదవండి..: Census India 2027 | జనగణన ప్రక్రియ దేశానికి ఎంతో కీలకం..: షబ్బీర్ అలీ

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *