అక్షరటుడే వెబ్‌డెస్క్: Disabled Persons Protest | దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆధ్వర్యంలో నిర్వహించిన అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. బషీర్‌బాగ్ నుంచి అసెంబ్లీ వైపు ర్యాలీగా వస్తున్న దివ్యాంగులను గన్‌పార్క్ వద్దే పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఆందోళనలో బీజేపీ శాసనసభాపక్ష ఉపనేత పాయల్ శంకర్, ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా తదితరులు పాల్గొన్నారు.
Disabled Persons Protest | డిమాండ్ చేసిన అంశాలు..
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా, 2023 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం దివ్యాంగులకు నెలకు రూ.6,000 పింఛన్ అందించాలని కోరారు. అలాగే ఎలాంటి గ్యారంటీ లేకుండా దివ్యాంగులకు రూ.5 లక్షల వరకు రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న బ్యాక్‌లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయడంతో పాటు ఇల్లు లేని దివ్యాంగులకు ఇళ్ల నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో పాటు, వారి సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఒక శాఖను ఏర్పాటు చేయాలని బీజేపీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Disabled Persons Protest | పోలీసుల అడ్డగింపు..
దివ్యాంగులను అసెంబ్లీ వైపు వెళ్లకుండా పోలీసులు భారీగా మోహరించి నిలువరించారు. కేవలం ఎమ్మెల్యేలను మాత్రమే లోపలికి అనుమతించడం పట్ల బీజేపీ నేతలు మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల పట్ల వివక్ష చూపుతోందని పాయల్ శంకర్ ఆరోపించారు. కేవలం సంక్షేమ పథకాలే కాకుండా.. దివ్యాంగులకు విద్య, ఉపాధి, ఆర్థిక స్వావలంబన, రవాణా రంగాల్లో సముచిత అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. దివ్యాంగుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు బీజేపీ తరఫున పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: OYO Rooms Ganja | ఓయో రూముల్లో గంజాయి విక్రయం.. ఇద్దరి అరెస్ట్