అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Drug Trafficking Control | మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల రవాణా, విక్రయం, వినియోగంపై గట్టి నిఘా కొనసాగించాలని, అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి సూచించారు. బుధవారం కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi)తో కలిసి ఎక్సైజ్ తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Drug Trafficking Control | పల్లెల్లో జోరుగా..
ఇటీవలి కాలంలో పల్లెల్లో గుడుంబా, నాటుసారా విక్రయాలు తిరిగి మొదలైనట్లు తెలుస్తోందని, ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీసే ఇలాంటి మత్తు పదార్థాల నిరోధానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని సుదర్శన్ రెడ్డి అన్నారు. యువతను, విద్యార్థులను మత్తుకు బానిసలుగా మారుస్తూ వారి భవిష్యత్తును అంధకారంగా మారుస్తున్న గంజాయి విక్రయాలపై గట్టి నిఘా ఉంచాలని సూచించారు. ఎన్ ఫోర్సుమెంట్, ఎక్సైజ్ బృందాలు సంయుక్తంగా దాడులు నిర్వహించాలని, ఎక్కడ కూడా మత్తు పదార్థాల జాడ కానరాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా కల్తీకల్లు విక్రయాలకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేయాలన్నారు. ఎక్కడైనా కల్తీ కల్లు కారణంగా అవాంచనీయ ఘటనలు జరిగితే, అందుకు ఎక్సైజ్ అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుందని సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. కల్తీ కల్లు తయారీ కోసం వినియోగిస్తున్న అల్ఫ్రాజోలం, డైజోఫాం, క్లోరోఫాం ఎక్కడి నుండి వస్తుంది, సరఫరాదారులు ఎవరు అనే మూలాలను అన్వేషించి, సూత్రధారులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.
Drug Trafficking Control | నిఘా పెంచాలి
కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలను రవాణా చేసే వారిని, వాటిని విక్రయిస్తున్న వారిని, వాటిని వినియోగిస్తున్న వారిని పక్కాగా గుర్తిస్తూ నిరంతర నిఘా కొనసాగించాలని ఆదేశించారు. అవసరమైతే పోలీసు శాఖ సహకారం తీసుకోవాలని, జిల్లాలో ఎక్కడ కూడా గంజాయి, క్లోరల్ హైడ్రేట్, డైజోఫామ్, అల్ఫ్రాజోలం, గుడుంబా, నాటుసారా వంటివి ఉనికిలో లేకుండా జిల్లాను మత్తు రహిత జిల్లాగా తీర్చిదిద్దాలన్నారు. పాఠశాలలు, కళాశాలలకు 100 మీటర్ల దూరం లోపు సిగరెట్లు, గుట్కాలు వంటి విక్రయాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, జిల్లా రెవెన్యూ అధికారి గీత, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ పి.శ్రీధర్, సూపరింటెండెంట్ నందగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Social Boycott Complaints | సామాజిక బహిష్కరణలపై బీసీ కమిషన్కు ఫిర్యాదులు