Bandi Sanjay Comments | ఓట్, సీట్ చోరీకి పాల్పడిన ఏకైక పార్టీ కాంగ్రెసే : బండి సంజయ్

కేసీఆర్ భూ వివాదాలపై చర్యలు తీసుకోవడం కేవలం కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న ఒక డ్రామా మాత్రమేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా విమర్శించారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Bandi Sanjay Comments | కేసీఆర్ భూ వివాదాలపై చర్యలు తీసుకోవడం కేవలం కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న ఒక డ్రామా మాత్రమేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా విమర్శించారు. బీఆర్ఎస్ చేసిన అవినీతిపై చర్యలు తీసుకునే దమ్ము, సోయి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని, అలాగే కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలపై పోరాడే సామర్థ్యం బీఆర్ఎస్ పార్టీకి కూడా లేదని ఆయన దుయ్యబట్టారు. ఈ రెండు పార్టీల మధ్య చీకటి ఒప్పందాలు ఉన్నాయని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా సేవను పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో గీతాభవన్ చౌరస్తా నుండి హౌజింగ్ బోర్డు కాలనీ పడవ చౌరస్తా వరకు ‘సేవా జ్యోతి’ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన బండి సంజయ్ రాజకీయంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

Bandi Sanjay Comments | త్వరలో కీలక బాధ్యతలు..

తెలంగాణ  ( Telangana ) బీజేపీలో బండి సంజయ్‌కి త్వరలో కీలక బాధ్యతలు అప్పగించబోతున్నారన్న ప్రచారం జరుగుతున్న వేళ ఆయన స్పందించారు. బీజేపీ తనకు ఎన్నో పదవులు, అవకాశాలు ఇచ్చిందని, తాను పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. పార్టీ తనకు ఏ బాధ్యత అప్పగించినా శిరసావహిస్తానని, కేవలం సాధారణ కార్యకర్తలాగే పార్టీ కోసం పని చేస్తానని ఆయన స్పష్టం చేశారు.

Bandi Sanjay Comments | ఓటు, సీటు చోరీ..

దేశంలో మొట్టమొదటి ఓట్, సీట్ చోరీకి పాల్పడిన ఏకైక పార్టీ కాంగ్రెస్ అని బండి సంజయ్ విమర్శించారు. 1946లో పీసీసీలన్నీ సర్దార్ పటేల్ ప్రధాని కావాలని ప్రతిపాదిస్తే, కాంగ్రెస్ మాత్రం నెహ్రూను ప్రధాని చేసి ఓటు, సీటు చోరీకి పాల్పడిందని ఆరోపించారు. దేశంలో పెద్ద ఎత్తున భోగస్ ఓట్లున్నాయని కాంగ్రెస్ చెప్పిందని, ఇప్పుడు ఆ ఓట్లన్నీ తొలగిస్తుంటే ఆ పార్టీకి ఎందుకు అభ్యంతరం అని ఆయన ప్రశ్నించారు. ప్రధాని మోదీకి ఓట్, సీట్ చోరీ చేయాల్సిన అవసరం లేదని, ఆయనకు కుటుంబం, బ్యాంకు బ్యాలెన్సులు, బినామీ ఆస్తులు, వారసత్వ రాజకీయాల ఆశలు లేవన్నారు. పదవి నుండి దిగిపోయిన వెంటనే సామాన్యుడిలా ప్రజా సేవలో తరించే మహనీయుడు మోదీ అని కొనియాడారు.

Bandi Sanjay Comments | జెన్ జీ యువతకు విజ్ఞప్తి..

కాంగ్రెస్ సహా కొన్ని పార్టీలు చెబుతున్న మాటలను నమ్మి జెన్ జీ (Gen-Z) యువత మోసపోవద్దని బండి సంజయ్ సూచించారు. ప్రధాని మోదీ రాజకీయ నేపథ్యం, ఆయన దేశానికి చేసిన సేవలను యువత గుర్తుచేసుకోవాలని కోరారు. మోదీ లేని భారత్‌ను ఊహించలేమని, స్వార్థం వీడి దేశం కోసం ఆలోచించాలని పిలుపునిచ్చారు. 2014కు ముందున్న భారత్‌కు, నేటి భారత్‌కు మధ్య ఉన్న అభివృద్ధిని బేరీజు వేసుకొని ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు.

Bandi Sanjay Comments | విమర్శలు సరికాదు..

ఎన్నికల కమిషన్ అనేది రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన సంస్థ అని, ఇదెలాంటి బీజేపీ జేబు సంస్థ కాదని బండి సంజయ్ స్పష్టం చేశారు. రాజ్యాంగ సంస్థలను బదనాం చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకే పెను ప్రమాదమని హెచ్చరించారు. రాహుల్ గాంధీ ఎప్పుడైనా అపాయింట్‌మెంట్ తీసుకుని ఈసీని కలవవచ్చని, కానీ నిన్న వందలాది మందితో వెళ్లి బలవంతంగా దాడికి ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకోక ఏం చేస్తారని ప్రశ్నించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడంతో పాటు, అనర్హులు మరియు చనిపోయిన వారి ఓట్లను తొలగించడమే ఎస్ఐఆర్ (SIR) లక్ష్యమని తెలిపారు. తెలంగాణలో 2014కు ముందు లక్షలాది మంది రోహింగ్యాలు, పాకిస్తాన్, బంగ్లాదేశ్ చొరబాటుదారులు ఉన్నారని, ఒక్క మహేశ్వరం నియోజకవర్గంలోనే 30 వేలకుపైగా రోహింగ్యాల ఓట్లున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి:  Social Boycott Complaints | సామాజిక బహిష్కరణలపై బీసీ కమిషన్​కు ఫిర్యాదులు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *