అక్షరటుడే, కామారెడ్డి: Drunk and Drive Case 1 | మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కామారెడ్డి పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన 434 మంది నిందితులకు జిల్లాలోని వివిధ న్యాయస్థానాలు సోమవారం శిక్షలు విధించాయి.
కోర్టులు నిందితులందరికీ కలిపి మొత్తం రూ.4,94,300 జరిమానా విధించడంతో పాటు 46 మందికి జైలు శిక్ష ఖరారు చేశాయి. జైలు శిక్ష పొందిన వారిలో 29 మందికి ఒక రోజు, 16 మందికి రెండు రోజుల పాటు, మరో వ్యక్తికి ఐదు రోజుల కారాగార శిక్ష విధించారు.
Drunk and Drive Case 1 | రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మద్యం మత్తులో వాహనం నడపడం చట్టవిరుద్ధమే కాకుండా, ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పుగా మారుతుందని హెచ్చరించారు.
మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు పెరిగి అమాయకుల ప్రాణాలు బలవుతున్నాయని, ప్రమాదాల్లో బాధిత కుటుంబాలు తీవ్ర విషాదంలో కూరుకుపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. క్షణిక ఆనందం కోసం ప్రాణాలను ప్రమాదంలో పడేయవద్దని, కుటుంబ సభ్యుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
మద్యం మత్తులో స్టీరింగ్ పట్టడం జీవితాలను ప్రమాదంలోకి నెట్టే చర్య అని పేర్కొన్న ఎస్పీ, డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ప్రత్యేక డ్రైవ్‌లు కొనసాగుతాయని స్పష్టం చేశారు.