Dryland Crops Awareness | ‘ఆరుతడి’పై అనాసక్తి.. క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కరువు

ఎల్​నినో ప్రభావంతో గతంలో కంటే తక్కువగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ, ప్రభుత్వం ప్రకటించింది.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Dryland Crops Awareness | ఎల్​నినో ప్రభావంతో గతంలో కంటే తక్కువగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ, ప్రభుత్వం ప్రకటించింది. ఫలితంగా రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించి లాభాలు గడించాలని ప్రభుత్వం పదేపదే చెప్తోంది. క్షేత్రస్థాయిలో మాత్రం అధికార యంత్రాంగం తీరు విరుద్ధంగా ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆరుతడి పంటలపై కనీస అవగాహన కార్యక్రమాలు చేపట్టడం లేదన్న విమర్శలున్నాయి. ఈ క్రమంలో రైతన్నల పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది.

Dryland Crops Awareness | కామారెడ్డి జిల్లాలో..

కామారెడ్డి జిల్లా (Kamareddy District)లో ఈసారి వర్షాలు మొదటి నుంచే నిరాశపరిచాయి. జూన్‌లో మొలకెత్తాల్సిన పంటలు జులై చివరికొచ్చినా నీళ్ల కోసం ఎదురుచూశాయి. వాగులు, చెరువులు ఎండిపోయాయి. వ్యవసాయ శాఖ మాత్రం ఆరుతడి పంటలే మార్గమని ప్రకటనలు విడుదల చేసింది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ప్రకటనలు పత్రికల్లో, టీవీల్లో కనిపిస్తున్నాయే తప్ప రైతు పొలంలోకి రాలేదు. ఫలితంగా అన్నదాత మళ్లీ యథావిధిగా వరి, మొక్కజొన్నల వైపే మొగ్గు చూపుతున్నాడు.

Dryland Crops Awareness | ఆరుతడి పంటలపై అవగాహనేది..?

వర్షాభావం నేపథ్యంలో కంది, పెసర, మినుము, సజ్జ, కొర్రలు వేసుకోవాలని అధికారులు సూచించారు. రెండు మూడు సదస్సులు పెట్టి బాధ్యత తీర్చుకున్నారు. కానీ మండల స్థాయికి వెళ్తే అవగాహన మాత్రం శూన్యం. జిల్లాలోని పలు మండలాల్లో రైతులను ఆరుతడి పంటలపై ఆరా తీస్తే ఆ పంటలు మా నేలలో పండుతాయా? పురుగు వస్తే ఏ మందు వాడాలి? ఎకరాకు ఎంత ఖర్చు, ఎంత ఆదాయం వస్తుంది? అనే ప్రశ్నలే ఎదురవుతున్నాయి. సమాధానం చెప్పేవారు లేరు. ప్రదర్శన క్షేత్రాలు లేవు. అధికారుల క్షేత్ర పర్యటనలు కాగితాలకే పరిమితమయ్యాయి. ఫలితంగా రైతుకు కొత్త పంట అంటేనే భయం పుట్టింది. తెలియని పంట వేసి నష్టపోతే ఆ అప్పు ఎవరు తీరుస్తారు? అని రైతులు  అడుగుతున్నారు.

Dryland Crops Awareness | ప్రత్యామ్నాయం తెలియదంటున్న రైతన్నలు

ప్రభుత్వం చెబుతోంది వింటున్నాం. కానీ నమ్మకం కుదరడం లేదు అనేది కామారెడ్డి రైతు మాట. గత ఏడాది మినుము వేసిన వాడు గిట్టుబాటు ధర లేక రోడ్డున పడ్డాడు. కందులను స్థానికంగా కొనేవాడు లేడు. విత్తనాలు దొరికినా రేటు ఎక్కువ. మార్కెట్ హామీ ఏది? అని రైతులు ప్రశ్నిస్తున్నారు. బ్యాంకుల్లో సైతం వరి, మొక్కజొన్న పేరు చెప్పినంత సులువుగా ప్రత్యామ్నాయ పంటలకు పంట రుణాలు ఇవ్వడం లేదు. అందుకే మాకు ఆ విషయం తెలియదు. తెలిసినా రిస్క్ చేయలేమని చేతులు ఎత్తేస్తున్నారు. ప్రభుత్వం చెప్పడం ఒకెత్తయితే, రైతు నమ్మడం మరోఎత్తుగా మారింది.

Dryland Crops Awareness | వరి, మొక్కజొన్న వైపే చూపు

నీళ్లు లేకున్నా బోర్ల మీద ఆధారపడి అయినా సరే కామారెడ్డి రైతు వరి, మొక్కజొన్నను వదులుకోవడం లేదు. కారణం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. వరికి  కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధర ఖాయంగా కనిపిస్తోందని, మొక్కజొన్నకు ఫీడ్ మిల్లులు, వ్యాపారులు ఇంటి వద్దకే వచ్చి కొంటున్నారని రైతులు చెప్తున్నారు. అలవాటు ఉంది, అనుభవం ఉంది, అప్పు దొరుకుతుంది. ఏదో ఒకటి మిగులుతుంది అనే ధైర్యం రైతుల్లో కనిపిస్తోంది. అదే ధైర్యం ఆరుతడి పంటలు వేయడంలో కనిపించడం లేదు. వరి నష్టపోయినా ఎఫ్​సీఐ తీసుకుంటుంది. కానీ సజ్జ వేస్తే ఎవరి ముందు పెట్టుకోవాలని రైతులు అడుగుతున్నారు.

Dryland Crops Awareness | వర్షాభావ పరిస్థితులపై అవగాహన కరువు

వాతావరణ శాఖ ముందుగానే వర్షాలు తగ్గుతాయని హెచ్చరించింది. అప్పుడే వ్యవసాయ యంత్రాంగం అప్రమత్తం కావాల్సింది. గ్రామాల వారీగా బృందాలు వెళ్లి, మట్టి రకాన్ని బట్టి ఏ పంట వేయాలో చెప్పాల్సింది. కనీసం ఒక్కో మండలంలో 50 ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటలతో ప్రదర్శన క్షేత్రాలు పెట్టి, గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వాల్సింది. అది జరగలేదని తెలుస్తోంది. ప్రకటనలతో, సర్క్యులర్లతో సరిపెట్టారు తప్ప ఫలితం రైతు ముందుకు రాలేదు. ఇప్పుడు బోర్లు కూడా అడుగంటుతున్నాయి. వచ్చే పంట కూడా ప్రశ్నార్థకంగా మారింది. ప్రకటనలకే పరిమితమైన యంత్రాంగం వైఫల్యం కామారెడ్డి పొలాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇకనైనా అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఆరుతడి పంటల వైపు రైతుల దృష్టి మళ్లించాల్సిన అవసరం ఉంది.

Dryland Crops Awareness | రైతులకు అవగాహన కల్పిస్తున్నాం

– మోహన్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి

వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులకు ఆరుతడి పంటలపై అవగాహన కల్పిస్తున్నాం. రైతు వేదికలలో రైతులతో సమావేశం నిర్వహించి ఏ పంట వేయాలో చెప్తున్నాం. అవగాహన కల్పించడం లేదనేది అవాస్తవం. పంటలపై మెసేజ్ ద్వారా కూడా రైతులకు సమాచారం చేరవేస్తున్నాం. కంది, పెసర, మినుము పంటలకు సబ్సిడీ కూడా ఇస్తున్నాం. ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలి. రైతులు నీటి అవసరం తక్కువ ఉండే పంటలపై దృష్టి సారించాలి.

ఇది కూడా చదవండి..: Steel Bank Bheemgal | భీమ్​గల్​లో ‘స్టీల్​ బ్యాంక్​’ ప్రారంభం.. ప్లాస్టిక్ రహిత మండలం​ దిశగా ముందడుగు..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *