e HRMS Portal Services | ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇకపై కాగితపు దరఖాస్తులకు స్వస్తి! ‘ఈ-హెచ్‌ఆర్‌ఎంఎస్‌’ ద్వారానే సెలవులు, ఇంక్రిమెంట్లు, పెన్షన్ సేవలు!

దరఖాస్తు సమర్పించినప్పటి నుంచి అధికారుల పరిశీలన, ఆమోదం వరకు ప్రతి దశను ఉద్యోగులు ఆన్‌లైన్‌లోనే ట్రాక్ చేసుకునే వెసులుబాటు కల్పించారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: e HRMS Portal Services | ప్రభుత్వ కార్యాలయాల్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న కాగితపు ఫైళ్ల సంస్కృతికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో చెక్ పెట్టింది. ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ వ్యవహారాలన్నింటినీ అత్యంత పారదర్శకంగా, వేగవంతంగా పరిష్కరించేందుకు పరిపాలనా ప్రక్రియలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది.

ఇకపై ఉద్యోగుల సేవా సంబంధిత దరఖాస్తులన్నీ ఈ-హెచ్‌ఆర్‌ఎంఎస్‌ (e-HRMS – ఎలక్ట్రానిక్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్) పోర్టల్ ద్వారానే నిర్వహించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

e HRMS Portal Services | ఐఎఫ్‌ఎంఐఎస్‌ పోర్టల్‌లో కొత్త విభాగం..

ఇప్పటివరకు సెలవులు మొదలుకుని, ఇంక్రిమెంట్లు, ఇతర ఆర్థిక ప్రయోజనాల కోసం ఉద్యోగులు కాగితాలపై దరఖాస్తులు రాసి కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వచ్చేది.

ఈ ఇబ్బందులకు తెరదించుతూ, వేతన బిల్లుల నిర్వహణకు ఉపయోగించే ఐఎఫ్‌ఎంఐఎస్‌ (IFMIS) పోర్టల్‌లోనే ప్రత్యేకంగా ‘ఈ-హెచ్‌ఆర్‌ఎంఎస్‌’ మాడ్యూల్‌ను అందుబాటులోకి తెచ్చారు. ప్రభుత్వం ప్రత్యేక మినహాయింపు ఇచ్చిన అత్యవసర సందర్భాల్లో తప్ప, ఇకపై ఎలాంటి ప్రతిపాదనలను మాన్యువల్‌గా (కాగిత రూపంలో) స్వీకరించబోమని తేల్చిచెప్పింది.

e HRMS Portal Services | ఆన్‌లైన్ పరిధిలోకి వచ్చిన కీలక సేవలు ఇవే..

అన్ని రకాల సెలవులు: సాధారణ సెలవులు (CL), ఆర్జిత సెలవులు (EL), అర్ధవేతన సెలవులు (HPL), రూపాంతర సెలవులు, ప్రసూతి సెలవులు (Maternity Leave), పిల్లల సంరక్షణ సెలవుల (Child Care Leave) కోసం ఆన్‌లైన్‌లోనే అప్లై చేసుకోవాలి.

ఆర్థిక ప్రయోజనాలు: వార్షిక వేతన ఇంక్రిమెంట్లు, నిలిచిపోయిన ఇంక్రిమెంట్ల మంజూరు, జీపీఎఫ్ (GPF) అడ్వాన్స్, పార్ట్ ఫైనల్, ఫైనల్ విత్‌డ్రాయల్ ప్రక్రియ అంతా డిజిటల్ విధానంలోనే జరుగుతుంది.

సర్వీస్ & రిటైర్మెంట్ సేవలు: ఉద్యోగుల సర్వీస్ రిజిస్టర్ (SR) నిర్వహణ, ప్రమోషన్లు, బదిలీలు, పే ఫిక్సేషన్, ఎల్‌టీసీ (LTC), మెడికల్ రీయింబర్స్‌మెంట్‌తో పాటు పదవీ విరమణకు సంబంధించిన పెన్షన్ ప్రతిపాదనలను సైతం ఇదే పోర్టల్ ద్వారా పూర్తి చేయనున్నారు.

e HRMS Portal Services | డీడీఓలపైనే కీలక బాధ్యత!

ఈ డిజిటల్ వ్యవస్థను పక్కాగా అమలు చేసే బాధ్యతను డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారులకు (DDOs) అప్పగించారు. డీడీఓలు తమ పరిధిలోని సిబ్బంది వివరాలను ఐఎఫ్‌ఎంఐఎస్‌, ఈ-హెచ్‌ఆర్‌ఎంఎస్‌ పోర్టల్‌లో క్షుణ్ణంగా పరిశీలించాలి.

ఉద్యోగులందరి లాగిన్ ఐడీలు యాక్టివ్‌గా ఉన్నాయో లేదో నిర్ధారించి, సాంకేతిక సమస్యలు ఉంటే తక్షణమే పరిష్కరించాల్సి ఉంటుంది. అలాగే పోర్టల్ వినియోగంపై సిబ్బందికి అవగాహన కల్పించాలి.

e HRMS Portal Services | ఎప్పటికప్పుడు స్టేటస్ ట్రాకింగ్..

ఉద్యోగులు తమ ఐఎఫ్‌ఎంఐఎస్‌ లాగిన్ వివరాలతో ఈ-హెచ్‌ఆర్‌ఎంఎస్‌లోకి లాగిన్ అయి సేవలకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమర్పించినప్పటి నుంచి అధికారుల పరిశీలన, ఆమోదం వరకు ప్రతి దశను ఉద్యోగులు ఆన్‌లైన్‌లోనే ట్రాక్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. దీనివల్ల ఫైళ్ల జాప్యం, అవినీతికి ఆస్కారం లేకుండా వేగంగా పనులు పూర్తవుతాయి.

మరోవైపు, పోర్టల్ వాడకంపై ఉద్యోగులకు సందేహాలు నివృత్తి చేసేందుకు ఐఎఫ్‌ఎంఐఎస్‌ వెబ్‌సైట్‌లోని ‘డిజిటల్ గవర్నెన్స్’ మరియు ‘ఎంప్లాయీ కార్నర్’ విభాగాల్లో ప్రత్యేక ట్యుటోరియల్స్, సూచనలు, అవగాహన వీడియోలను అందుబాటులో ఉంచారు. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులందరూ తక్షణమే తమ లాగిన్ వివరాలు, వ్యక్తిగత సర్వీస్ రికార్డులను సరిచూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *