అక్షరటుడే, కామారెడ్డి: Education Bandh | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యను కార్పోరేటీకరణ చేసే యోచనలో ఉందని వామపక్ష విద్యార్థి సంఘాలు ఆరోపించారు. జూలై 10న జరగనున్న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌ను జయప్రదం చేయాలని కోరుతూ వామపక్ష విద్యార్థి సంఘాలు బుధవారం కామారెడ్డి (Kamareddy)లో భారీ ర్యాలీ నిర్వహించాయి.
Education Bandh | అన్ని సంఘా ఆధ్వర్యంలో..
ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ, ఏఐఎస్‌ఎఫ్, ఏఐపీఎస్‌యూ, ఏఐఎఫ్‌డీఎస్, బీవీఎం ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థులు నిజాంసాగర్ చౌరస్తా వరకు నినాదాలు చేస్తూ కదం తొక్కారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఎన్‌ఈపీ 2020 పేరుతో విద్యను కార్పొరేటీకరణ, కాషాయీకరణ చేస్తోందని ఆరోపించారు. దీనివల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్య దూరమవుతోందని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో అధ్యాపకుల కొరత, మౌలిక సదుపాయాల లేమి ఉన్నాయన్నారు.

పెండింగ్‌లో ఉన్న రూ.11 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్, కార్పొరేట్ సంస్థల అక్రమ ఫీజులు, బలవంతపు అమ్మకాలపై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయాలని కోరారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం జూలై 10న జరిగే బంద్‌ను విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సురేష్, ముదాం అరుణ్, జబ్బర్, శివప్రసాద్, విటల్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: CCTV Cameras | సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ సాధ్యమే.. : సీపీ సాయిచైతన్య