అక్షరటుడే వెబ్‌డెస్క్: Kaleshwaram Project Failure | కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ నేతల తీరుపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ( Jaggareddy )ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు కూలిపోవడానికి, నీటి నిల్వ సమస్యలకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలే కారణమని ఆయన ఆరోపించారు. గాంధీ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో జగ్గారెడ్డి హరీశ్ రావును ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Kaleshwaram Project Failure | నిర్మాణం మీది.. బాధ్యత కూడా మీదే!
ప్రాజెక్టు నిర్మాణ సమయంలో సిమెంట్, ఇసుక వేసింది మొదలు.. ఇటుకలు పేర్చే వరకు అంతా హరీశ్ రావు పర్యవేక్షణలోనే జరిగిందని జగ్గారెడ్డి గుర్తు చేశారు. “అప్పట్లో ఇరిగేషన్ మంత్రిగా ప్రాజెక్టు వద్దే మంచం వేసుకుని పడుకున్నానని గొప్పలు చెప్పుకున్నారు. ఇప్పుడు ప్రాజెక్టు కూలిపోతే, దానికి బాధ్యులు మీరు కాదా? అప్పుడు అధికారంలో లేని కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేయడం ఏంటి?” అని ప్రశ్నించారు.
Kaleshwaram Project Failure | అసెంబ్లీకి రండి తేల్చుకుందాం..
కేవలం బయట విమర్శలు చేయడం కాదు, కేసీఆర్‌ను వెంటబెట్టుకుని అసెంబ్లీకి రావాలని హరీశ్ రావుకు జగ్గారెడ్డి సవాల్ విసిరారు. “ఎన్డీఎస్ఏ (NDSA) నివేదికలను పట్టుకుని అసెంబ్లీలో చర్చిద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్‌ను స్వీకరించి మీ మామను తీసుకురండి.. ప్రజలకు నిజానిజాలు తెలుస్తాయి” అని స్పష్టం చేశారు. అలాగే, రేవంత్ రెడ్డి స్థాయికి మీ కెపాసిటీ సరిపోదని, సినిమా డైలాగులు కట్టిపెట్టి వాస్తవాలు మాట్లాడాలని సూచించారు.
Kaleshwaram Project Failure | మంత్రి పదవి నుంచి తొలగింపు..
కాళేశ్వరంలో జరిగిన తప్పుల వల్లే హరీశ్ రావును అప్పట్లో మంత్రి పదవి నుంచి కేసీఆర్ తప్పించారని ఆరోపించారు. డ్యామ్‌లో నీటిని నిల్వ ఉంచితే భద్రాచలం, ఖమ్మం ప్రాంతాలు మునిగిపోతాయని నిపుణులు హెచ్చరించినా, రాజకీయాల కోసం గత ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్లిందని విమర్శించారు. దొంగ మాటలు చెప్పడంలో బీఆర్ఎస్ ఫ్యామిలీ ఎక్స్‌పర్ట్ అని, ఇకనైనా ఇటువంటి అబద్ధపు రాజకీయాలు ఆపకపోతే ప్రజలు సహించరని జగ్గారెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పటిష్టంగా ఉందని, రాబోయే ఐదేళ్లు తమదే అధికారమని జగ్గారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఓర్వలేనితనంతోనే బీఆర్ఎస్ నేతలు లేనిపోని ఆరోపణలతో రాజకీయం చేస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు.
ఇది కూడా చదవండి: US Iran Tensions | ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం ముగిసింది: ట్రంప్