El Nino Impact Telangana | ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించండి: మంత్రి తుమ్మల

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: El Nino Impact Telangana | రాష్ట్రంలో ఎల్-నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించిన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. రైతులను ముందుగానే సన్నద్ధం చేసి, తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటల సాగుపై విస్తృత అవగాహన కల్పించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో వ్యవసాయ, ఉద్యానశాఖల ఉన్నతాధికారులతో మంత్రి కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎల్-నినో పరిస్థితులు, పంట వ్యర్థాల కాల్చివేత, కొహెడ మార్కెట్ శంకుస్థాపన, ఎరువుల నిర్వహణ వంటి పలు అంశాలపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు.

El Nino Impact Telangana | జూన్ 4 నుంచి గ్రామసభలు..

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ నెల 4, 6, 8, 10 తేదీలలో రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలు నిర్వహించాలని మంత్రి సూచించారు. వ్యవసాయశాఖ ఇప్పటికే సిద్ధం చేసిన జిల్లాల వారీ పంటల ప్రణాళికను ఈ సభల ద్వారా రైతులకు వివరించాలన్నారు. వర్షాభావాన్ని తట్టుకునే పంటలు, ఆరుతడి పంటల సాగుపై రైతులు దృష్టి సారించేలా క్షేత్రస్థాయిలో వ్యవసాయ విస్తరణ సిబ్బంది పని చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా లిఫ్ట్ ఇరిగేషన్, బోర్‌వెల్‌ ఆధారిత ప్రాంతాల్లో తక్కువ పంటకాలం ఉండే సన్నరకం వరి రకాలను ప్రోత్సహించాలని పేర్కొన్నారు. పంట వ్యర్థాలను తగులబెట్టడం వల్ల భూమి సారవంతం దెబ్బతినడమే కాకుండా పర్యావరణ కాలుష్యం పెరుగుతుందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. నాగర్ కర్నూల్ జిల్లాలో పంట వ్యర్థాల కాల్చివేతకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలు అందిన విషయాన్ని ప్రస్తావిస్తూ, రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి నివేదికలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో ఉదాసీనంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తప్పవని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినంగా ఉంటామని స్పష్టం చేశారు.
tummala

 

El Nino Impact Telangana | కొహెడ ఇంటర్నేషనల్ ఫ్రూట్ మార్కెట్‌కు శంకుస్థాపన..

రూ.2,284.32 కోట్ల భారీ వ్యయంతో కొహెడలో నిర్మించనున్న అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్‌కు ఈ నెల 6వ తేదీన ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు తెలంగాణ మార్కెటింగ్ రంగానికి మైలురాయిగా నిలుస్తుందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. వ్యవసాయశాఖ పరిధిలోని ఖాళీ స్థలాలు అక్రమంగా ఆక్రమించుకోకుండా కాపాడటానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. దీనికోసం నెల రోజుల్లోగా ఐఏఎస్ అధికారులతో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి, సమగ్ర కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. ఖాళీ స్థలాలను లీజుకు ఇచ్చి ఆదాయం సమకూర్చుకునే మార్గాలను పరిశీలించాలని, అది వీలుకాని చోట్ల పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని సూచించారు.

tummala.1

El Nino Impact Telangana | ఫెర్టిలైజర్ యాప్ పనితీరు..

ఎరువుల పంపిణీ, పర్యవేక్షణలో తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన ఫెర్టిలైజర్ యాప్ పనితీరును కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరోసారి అభినందించిందని మంత్రి వెల్లడించారు. కేంద్రం రూపొందించిన యాప్‌ను కూడా రాష్ట్రంలోని పైలట్ జిల్లాల్లో విజయవంతంగా అమలు చేయాలని కేంద్ర కార్యదర్శి కోరారని, దీనిని సమర్థవంతంగా నిర్వహిస్తే రాష్ట్రానికి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందుతాయని హామీ ఇచ్చారని తెలిపారు.

ఈ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో వ్యవసాయశాఖ సెక్రటరీ సురేంద్రమోహన్, డైరెక్టర్ గోపి, హార్టికల్చర్ ఎండి యాస్మిన్ బాషా, ఆగ్రోస్ ఎండి రాములు తదితర అధికారులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: FRO Caught by ACB | లంచం తీసుకుంటూ దొరికిన ఫారెస్ట్ రేంజ్​ ఆఫీసర్​

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *