అక్షరటుడే వెబ్‌డెస్క్: EPFO Online Correction | పీఎఫ్ (EPF) ఖాతాదారులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పెద్ద ఉపశమనం అందించింది. పీఎఫ్ రికార్డుల్లో ఏదైనా వివరాలు తప్పుగా నమోదై ఉంటే, ఇకపై కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా నేరుగా ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో సరిదిద్దుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. పీఎఫ్ ఖాతాలో ఉద్యోగి పేరు, పుట్టిన తేదీ, తండ్రి పేరు లేదా బ్యాంక్ అకౌంట్ వివరాల్లో పొరపాట్లు ఉంటే పీఎఫ్ క్లెయిమ్‌లు సబ్మిట్ చేయడం లేదా కేవైసీ అప్‌డేట్ చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి ప్రతీ ఉద్యోగి తమ పీఎఫ్ వివరాలన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో సరిచూసుకోవడం ఎంతో ముఖ్యం.
EPFO Online Correction | కీలక వివరాలు ఇవే..
ఉద్యోగులు ఈపీఎఫ్ఓ పోర్టల్‌లోని ‘జాయింట్ డిక్లరేషన్’ ఆప్షన్ ద్వారా పలు రకాల వివరాలను సులభంగా సవరించుకోవచ్చు. ఉద్యోగి పేరు, పుట్టిన తేదీ, తండ్రి లేదా భర్త పేరు, లింగం (Gender), మొబైల్ నెంబర్ , ఈమెయిల్ ఐడీని అప్‌డేట్ చేయవచ్చు. వీటితో పాటు కంపెనీలో చేరిన తేదీ (Date of Joining), ఉద్యోగం మానేసిన తేదీ (Date of Exit) వంటి ముఖ్య వివరాలను కూడా ఆన్‌లైన్‌లో మార్చుకోవడానికి ఈపీఎఫ్ఓ అవకాశం కల్పిస్తోంది.
EPFO Online Correction | సరిచేసుకునే విధానం..
పీఎఫ్ రికార్డుల్లో వివరాలను అప్‌డేట్ చేయడం కోసం ముందుగా యూఏఎన్ (UAN) పోర్టల్‌లో లాగిన్ కావాలి. మీ యూఏఎన్ నెంబర్, పాస్‌వర్డ్ , క్యాప్చా నమోదు చేసి ‘సైన్ ఇన్’పై క్లిక్ చేయాలి. అనంతరం మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్ అయ్యాక, హోమ్‌పేజీలోని ‘మేనేజ్’ (Manage) విభాగంలో ‘జాయింట్ డిక్లరేషన్’ (Joint Declaration) ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆపై మీ కంపెనీ పేరును సెలెక్ట్ చేసుకుని, సవరించాలనుకుంటున్న వివరాలను నమోదు చేసి ప్రొసీడ్‌పై క్లిక్ చేయాలి. మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని సబ్‌మిట్ చేస్తే వివరాలు అప్‌డేట్ అవుతాయి.
EPFO Online Correction | ఆన్‌లైన్ సేవ ప్రాముఖ్యత..
ఒక కంపెనీ రికార్డుల్లో వివరాలు ఒకలా, మరో కంపెనీలో ఇంకోలా ఉంటే పీఎఫ్ ఖాతా బదిలీ (Account Transfer) చేసుకోవడం , డబ్బులను క్లెయిమ్ చేయడం అసాధ్యంగా మారుతుంది. గతంలో వివరాలు మార్చాలంటే పీఎఫ్ కార్యాలయాలకు వెళ్లడం లేదా కంపెనీ యాజమాన్యాలపై ఆధారపడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఈపీఎఫ్ఓ తీసుకొచ్చిన ఆన్‌లైన్ జాయింట్ డిక్లరేషన్ విధానంతో ఎలాంటి ఆఫీసులకు వెళ్లకుండానే సులభంగా వివరాలు సరిదిద్దుకోవచ్చు.
ఇది కూడా చదవండి: Stock Market Closing | లాభాలతో ముగిసిన సూచీలు