అక్షరటుడే, వెబ్‌డెస్క్: Fake liquor racket | హైదరాబాద్ Hyderabad మహా నగరంలో కల్తీ మద్యం దందా జోరుగా సాగుతోంది. తక్కువ ధరకే లభించే చీప్ లిక్కర్‌ను సేకరించి, వాటిని అంతర్జాతీయ బ్రాండ్ల ఖరీదైన మద్యం సీసాల్లో నింపుతూ అమాయక ప్రజలకు అంటగడుతున్న ఘరానా మోసగాళ్ల ముఠాను గ్రేటర్ హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ (DTF) బృందం తాజాగా అరెస్టు చేసింది. ఎక్సైజ్ అధికారుల దాడులతో ఈ నకిలీ లిక్కర్ గుట్టు రట్టయింది.
Fake liquor racket | ఖరీదైన బాటిళ్లలో చీప్ లిక్కర్ మాయాజాలం
ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయ భాస్కర్ గౌడ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. శంషాబాద్‌లోని శాతంరాయికి చెందిన వంగలి అశోక్ అనే వ్యక్తి క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అయితే, క్యాబ్ నడుపుతూనే మరోవైపు అసాధారణ రీతిలో సులువుగా డబ్బు సంపాదించాలనే దురాశతో ఈ అక్రమ మార్గాన్ని ఎంచుకున్నాడు. స్క్రాప్ వ్యాపారి యాకూబ్ పాషా వద్ద నుంచి ‘జానీ వాకర్’, ‘100 పైపర్స్’ వంటి ఖరీదైన అంతర్జాతీయ బ్రాండ్ల ఖాళీ సీసాలను సేకరించేవాడు.
ఆ ఖాళీ బాటిళ్లలో ఎవరికీ అనుమానం రాకుండా తక్కువ ధర ఉన్న నాసిరకం చీప్ లిక్కర్‌ను నింపి, అసలైన బ్రాండెడ్ మద్యామంటూ విక్రయిస్తూ అమాయక వినియోగదారులను మోసగిస్తున్నాడు.
Fake liquor racket | ఎక్సైజ్ అధికారుల దాడి
పక్కా సమాచారంతో గ్రేటర్ హైదరాబాద్ డీటీఎఫ్ (DTF) అధికారులు రంగంలోకి దిగి నిందితుల కేంద్రాలపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో 10 ఫుల్ మిక్సింగ్ (కల్తీ మద్యం నింపిన) బాటిళ్లతో పాటు 30కి పైగా ఖరీదైన బ్రాండ్లకు చెందిన ఖాళీ సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ నకిలీ మద్యం రాకెట్‌లో ప్రధాన సూత్రధారులైన వంగలి అశోక్, యాకూబ్ పాషాలను అదుపులోకి తీసుకుని ఎక్సైజ్ చట్టం కింద కేసులు నమోదు చేశారు. బ్రాండెడ్ మద్యం పేరుతో సాగుతున్న ఈ కల్తీ దందాపై మరింత లోతుగా విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. పండుగలు, రాత్రి వేళల్లో ఇలాంటి నకిలీ మద్యం విక్రయాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎక్సైజ్ శాఖ హెచ్చరించింది.
Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్ దిశగా మరో అడుగు..