అక్షరటుడే, కామారెడ్డి: Ganesh Shobhayatra Kamareddy | ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పోలీసులు డీజేలకు అనుమతి నిరాకరించడంతో కామారెడ్డి(Kamareddy) గణేష్ నిమజ్జన శోభాయాత్రలో కొత్త ట్రెండ్ కనిపించింది. దేవునిపల్లి, గర్గుల్, క్యాసంపల్లి, లింగాపూర్ తదితర గ్రామాల్లోని ఉత్సవ కమిటీలు లక్షల రూపాయలు వెచ్చించి మహారాష్ట్రలోని నాసిక్ నుంచి ప్రత్యేక డోలక్ (Nashik Dhol) బృందాలను రప్పించాయి.
Ganesh Shobhayatra Kamareddy | ఉద్వాసన పూజలు పూర్తి చేసుకుని..
సోమవారం మండపాల్లో ఉద్వాసన పూజలు పూర్తి చేసుకుని బయలుదేరిన గణనాథుల శోభాయాత్ర డోలక్ దరువులతో మంగళవారం రాత్రి వరకు దాదాపు 24 గంటల పాటు నిర్విరామంగా సాగింది. డీజే లేని లోటు కనిపించకుండా యువకులు డోలక్ చప్పుళ్లకు అనుగుణంగా నృత్యాలతో హోరెత్తించారు. అనంతరం మున్సిపాలిటీ పరిధిలోని టేక్రియాల్ చెరువుతో పాటు పలు గ్రామ చెరువుల్లో గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేశారు. భారీ విగ్రహాలను జేసీబీల సాయంతో గంగమ్మ ఒడికి చేర్చగా, భద్రతా కారణాల దృష్ట్యా నిర్వాహకులను చెరువులోకి అనుమతించలేదు. పోలీసు, మున్సిపల్, రెవెన్యూ శాఖలు ఏర్పాట్లు చేపట్టి నిమజ్జనాన్ని ప్రశాంతంగా పూర్తి చేయించారు.